తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు గత నెలరోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే, కొన్నిరోజులుగా ఆయన డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతుండడంతో, నిన్న ప్రభుత్వ వైద్యులు వెళ్లి ఆయనను పరిశీలించి తగిన ఔషధాలు సూచించారు. కానీ, చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అన్నీ నియంత్రణలోనే ఉన్నాయని తెలిపారు. బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధం అని చెప్పారు. చంద్రబాబును ఆసుపత్రికి తరలిస్తున్నట్టు, ఆసుపత్రి బెడ్ పై చంద్రబాబు ఉన్నట్టు కొన్ని పాత ఫొటోలు దర్శనమిస్తున్నాయని, అదంతా అవాస్తవం అని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు.