తెలంగాణ వీణ , జాతీయం : భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ మజానా వేరు. అది ఏ స్థాయిలో జరిగినా. ఎక్కడ జరిగినా సరే. ఇక ప్రపంచకప్ లాంటి బిగ్ టోర్నీ గురించి అయితే చెప్పాల్సిన పనేలేదు. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రత్యక్షంగా వీక్షించేందుకు తహతహలాడే ప్రేక్షకులు ఎందరో. ప్రస్తుతం భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భాగంగా రేపు అహ్మదాబాద్లో దాయాదుల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ను కళ్లారా చూడాలని భావిస్తున్న అభిమానులు అహ్మదాబాద్ చేరుకుంటున్నారు.
అభిమానులతో ఇప్పటికే హోటళ్లు, లాడ్జీలు నిండిపోవడంతో.. ఇప్పుడు ఆసుపత్రుల బాట పడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మ్యాచ్ను ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకూడదన్న లక్ష్యంతో స్థానిక ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు తీసుకుని బెడ్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ ఇప్పుడు రోగులకు బదులుగా క్రికెట్ ఫీవర్తో బాధపడుతున్న వారితో నిండిపోయాయి.