తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో కోదండరాం, వైఎస్ షర్మిల పార్టీలను కాంగ్రెస్ వాడుకుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ తన అభ్యర్థులను కాంగ్రెస్ నుంచి గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకే వారితో రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారని, ఎన్నికల్లో వారికి అయ్యే డబ్బును కూడా కేసీఆర్ ఖర్చు చేస్తున్నారన్నారు. తమ వారిని కాంగ్రెస్ నుంచి పోటీ చేయించి, గెలిపించుకోవడం ద్వారా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ, అక్రమ, అవినీతి పాలన సాగుతోందన్నారు. ఈ పాలనను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే కాంగ్రెస్‌లోని తన మద్దతుదారులను గెలిపించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. వాళ్లను బీఆర్ఎస్కు రాజీనామా చేయించి, కాంగ్రెస్‌లో చేర్పించారన్నారు. నవంబర్ 30న కేసీఆర్‌కు గుడ్ బై చెప్పాలంటే ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలన్నారు. ఎక్కువ శాతం ఉన్న బీసీల నుంచి ఒక్క ముఖ్యమంత్రి అభ్యర్థి లేరా? అని ప్రశ్నించారు. అరవై శాతం ఉన్న బీసీలకు కనీసం అరవై సీట్లు ఇవ్వలేదన్నారు.