తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఈ నెల 18న సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో భారీగా నిర్వహించనున్న బహిరంగ సభకు మంత్రి మల్లారెడ్డి బీఆర్‌ఎస్ నేతలతో కలిసి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఎంఆర్ కళాశాల మైదానం, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి, హైదరాబాద్-మేడ్చల్ రహదారిలో కొంపల్లి వంతెనకు సమీపంలో కుడివైపున ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.
ఈ మూడు స్థలాల్లో కొంపల్లి వంతెనకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. 44వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ మైదానం సభకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని నిర్ణయించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు సీఎం కేసీఆర్ సభ కీలకం కావడంతో సభను విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మర్రి నర్సింహా రెడ్డి, శేఖర్ గౌడ్, రామస్వామి, దయానంద్ యాదవ్, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.