తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబు ఎంతకాలానికి జైలు నుంచి బయటకు వస్తారో తెలియక సతమతమవుతున్న టీడీపీ నైరాశ్యంలో కూరుకుపోతుంటే, తమ అధినేత జగన్ ఇచ్చిన స్పీచ్ ఊపుతో రెట్టించిన ఉత్సాహంతో వైఎస్సార్‌సీపీ నేతలు జనంలోకి వెళతారు. చంద్రబాబు కేసుల విషయాలన్ని కేంద్రంలోని పెద్దలకు, అంటే ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులకు తెలిసినవేనని.. ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనమైనవే అని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక నేతల సమావేశంలో ఆయన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. ఆయన సభకు వచ్చినప్పుడు.. ఆయా సందర్భాలలో కీలకమైన ప్రకటనలు చేసినప్పుడు పార్టీ నేతలలో వ్యక్తం అయిన స్పందన కచ్చితంగా వైఎస్సార్‌సీపీకి మంచి జోష్ తెచ్చాయని చెప్పొచ్చు.తొలుత. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, దాని ప్రభావం వివరించి.. ప్రజల వద్దకు వెళ్లడానికి మళ్లీ పార్టీ నేతలను ఆయన మోటివేట్ చేసిన తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విసుర్లు విసరడంతో అక్కడ చప్పట్లు మారుమోగాయి. ఇన్నాళ్లుగా జగన్ తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారో చూద్దామని ప్రజలు వేచి ఉన్న తరుణంలో ఆయన సీమ టపాకాయలు పేల్చినట్లు మాట్లాడి చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలలో రిలవెన్స్ కోల్పోయారన్న అభిప్రాయం కలిగేలా వ్యాఖ్యానించారు.