పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వ్యాపార దక్షతతో మాత్రమే కాదు, తనదైన వ్యక్తిత్వం, దాతృత్వంతో ఆయన ప్రత్యేకతే వేరు. అందుకే సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇదే విషయాన్నిమరోసారి నిరూపించుకున్నారు రతన్ టాటా. మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు. భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో టాప్‌లో ప్లేస్ కొట్టేశారు
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఎక్స్ ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు. ఆ తరువాతి స్థానంలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు.
ఈ జాబితాలో టాప్ టెన్‌లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ సత్య నాదెళ్ల, వ్యాపార వేత్తలు నందన్ నీలేకని, రోణీ స్క్రూవాలా, హర్ష వర్థన్ గోయింగా, కిరణ్ మజుందార్ షా, ఉదయకోటక్ నిలిచారు.