తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యను ఏపీ నుండి తెలంగాణకు బదిలీ చేసినట్లుంది. చంద్రబాబు నాయుడి అరెస్ట్ నేపథ్యంలో ఏపీ టిడిపి కార్యాలయంలో చంద్రబాబు కుర్చీలో కూర్చుని వార్తల్లోకి ఎక్కిన బాలకృష్ణ.. తాజాగా ఏపీలో యాక్టివ్ గా లేరు. తెలంగాణా టీడీపీలో ఆయన కాస్త చురుగ్గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో సత్తా చాటుతామని బాలకృష్ణ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఎన్టీయార్ ట్రస్ట్ వేదికగా అన్నారు. తెలంగాణా టీడీపీ నేతలతోనే ఆయన సమావేశాలు నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఏపీ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటే పార్టీ నారా వారి చేతుల్లోంచి నందమూరి వారి హస్తగతం అవుతుందేమోనన్న భయంతోనే ఈ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రూ. 371 కోట్ల రూపాయల దోపిడీ కేసులో ఆధారాలతో సహా దొరికిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజునే బాలకృష్ణ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూర్చునే కుర్చీలో కూర్చున్నారు బాలయ్య. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కాగానే నారా శిబిరంలో కంగారు మొదలైనట్లుంది. తన కుర్చీలో బాలయ్య కూర్చోవడం చంద్రబాబుకు కూడా నచ్చలేదని అంటున్నారు. తన సీటులో బాలయ్య కూర్చున్న సమాచారం తెలియగానే చంద్రబాబు నాయుడు ములాఖత్ కు వచ్చిన పార్టీ సీనియర్లు, తన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చారు.
ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో జరిగిన మరో సమావేశంలో చిత్రంగా బాలయ్యకు .. అచ్చెన్నాయుడి పక్కన కుర్చీ కేటాయించారు. అక్కడే కూర్చోవలసిందిగా పార్టీ నేతలు సూచించడంతో బాలయ్య ఒక్క నిముషం విస్తుపోయినా.. చేసేది లేక చంద్రబాబు కుర్చీలో కాకుండా తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు.
అసలు ఆయన రోజు పార్టీ కార్యాలయానికి రావడం..రాజకీయ నిర్ణయాల్లో పాలు పంచుకోవడం కూడా మంచిది కాదనుకున్న చంద్రబాబు నాయుడు బాలయ్యను నెమ్మదిగా ఏపీ వ్యవహారాలకు దూరం పెట్టే వ్యూహం అమలు చేశారని అంటున్నారు.అందుకే బాబును అరెస్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే ఏపీలో ఉన్న బాలయ్య ఆ తర్వాత అమాంతం హైదరాబాద్ లోని ఎన్టీయార్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తెలంగాణా టీడీపీ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే తెలంగాణాలో టీడీపీ పని అయిపోయిందని హేళన చేసిన వారికి గుణపాఠం చెప్పేలా వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ సత్తా చాటుతుందని బాలయ్య సవాల్ విసిరారు.