తెలంగాణ వీణ : ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట కలిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పులు గురించి తప్పుడు సమాచారం అందించారని రామఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి, తిరిగి వెనక్కి తీసుకుని సమర్పించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఇరువర్గాల తరపున వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.