తెలంగాణ వీణ , పాలిటిక్స్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైన వేళ కారు టాప్‌గేర్‌లో దూసుకుపోతుండగా, ప్రతిపక్షాలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించాలన్న దృఢ సంకల్పంతో బీఆర్‌ఎస్ ప్రచారంలో దూసుకెళ్తున్నది. అగస్టు 21న సీఎం కేసీఆర్ 115 మంది జాబితాను ప్రకటించిన వెంటనే ఆ పార్టీ అభ్యర్థులంతా ప్రచారంలోకి దిగారు. దాదాపు 50 రోజులుగా క్యాడర్ మొత్తం కదం తొక్కుతున్నది. విజయం తమదే అన్న ధీమాతో ముందుకుసాగుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కనీసం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. వామపక్షాలు, ఇతర చిన్నాచితకా పార్టీలు కనీసం సోదిలో కూడా లేవు.
తొమ్మిదిన్నరేండ్ల పాలనే పాశుపతాస్త్రం
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తొమ్మిదిన్నరేండ్ల పాలననే బీఆర్‌ఎస్ ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు ప్రజలకు అనుభవంలోనే ఉన్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఈ అంశాలనే ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తున్నారు. మిషన్‌భగీరథ, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, టీఎస్‌ఐపాస్, పారిశ్రామికాభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానంగా మారడం వంటి అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. మళ్లీ గెలిపిస్తే ఇంతకుమించిన అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని చెప్తున్నారు. తమ భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే సీఎం కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న ప్రజలు బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తల కోలాహలం మధ్య గ్రామగ్రామాన ప్రచారం జోరుగా సాగుతున్నది. అభ్యర్థులు ఇప్పటికే దాదాపు నియోజకవర్గం మొత్తం చుట్టివచ్చారు. అనేక గ్రామాల ప్రజలు తాము బీఆర్‌ఎస్ వెంటే ఉంటామని, సీఎం కేసీఆర్ అభివృద్ధికే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు.