Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సమరానికి సై…ఇప్పటి వరకు ఒక లెక్క…ఇకపై మరో లెక్క… విజయం కోసం అన్ని పార్టీల తహతహ

Must read

తెలంగాణ వీణ, ఎడిటోరియల్ : సరికొత్త వ్యూహాలు…ప్రతివ్యూహాలతో మరింత హీటెక్కనున్న రాష్ట్ర రాజకీయాలు
ఎన్నికల గంట మోగింది. ఇక ఎన్నికలకు సమరోత్సాహంతో కదన రంగంలోకి దూకేందుకు అన్ని రాజకీయ పార్టీలు తహతహ లాడుతున్నాయి. ఇప్పటి వరకు రాజకీయాలు ఒక లెక్క కాగా….ఇకపై రాజకీయాలు మరో లెవల్లో ఉండబోతున్నాయి. సరికొత్త వ్యూహాలు…ప్రతి వ్యూహాలు, సవాళ్లు…ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమో….వీర స్వర్గమో అన్న రీతిలో చివరి నిమిషం వరకు రాజకీయ పార్టీలు తలబడనున్నాయి. ఈ నేపథ్యంలో నేతల జాతరతో రాష్ట్రం తడిచి ముద్దవ్వనుంది. ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక జిమ్మిక్కులు ప్రారంభం కానున్నాయి. అనేక చిత్ర, విచిత్రాలు మన కళ్ల ముందు కదలాడనున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్ధుల జాబితాలను ప్రకటించిన అధికార బీఆర్ఎస్ ప్రచార పర్వంలోనూ మరింత దూకుడుగా వెళ్లనుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 15వ తేదీ నుంచే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఆ రోజున తెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్ధుల సమావేశం నిర్వహించడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతున్నారు. తదనంతరం అభ్యర్ధులకు బీ ఫాం ఇచ్చిన తరువాత జిల్లా పర్యటనలకు వెళ్లనున్నారు. ఈ ఎన్నికల కోసం 114 మంది అభ్యర్థులను ప్రకటించింది. త్వరలోనే రెండో జాబితాను విడుదల చేయబోతుంది. జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం షురూ చేశారు. పార్టీలోని కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావు వరుసగా జిల్లాల పర్యటనలు సాగిస్తున్నారు. పార్టీ తలపెట్టిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ… ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు దాడిని మొదలుపెట్టారు. మరోసారి బీఆర్ఎస్ కు ఎందుకు పట్టం కట్టాలనే అంశంపై కూలంకషంగా ప్రజలకు వివరిస్తున్నారు. పనిలో పనిగాకాంగ్రెస్, బీజేపీ పార్టీలను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్ధుల జాబితాను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లోనే మొదటి జాబితాను వెళ్ల డించేందుకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో ప్రచార పర్వంలోనూ దూసుకపోయే విధంగా ప్రణాకలను సిద్ధం చేస్తున్నారు. ఇక ఢిల్లీ నుంచి రెండు పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు కూడా రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటించనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం గడువు ముగిసేంత వరకు నేతల జాతర ఒక రేంజ్ లో ఉండనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రానికి మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. ఇక త్వరలోనే జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారానికి క్యూ కట్టనున్నారు.
కంప్లీట్ డిఫరెంట్ సినారియో
రాష్ట్రంలో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. దీంతో రోజుకో విధంగా కొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్ల నాడి కూడా అంత సులువుగా రాజకీయ పండితులకు సైతం అంతుపట్టడం లేదు. దీంతో రాజకీయ వాతావరణం పూర్తిగా ఢిఫరెంట్ గా కనిపిస్తోంది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రెండు పర్యాయాలు (2014, 2018) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విక్టరీ కొట్టింది. అయితే గత ఎన్నికల నాటి పరిస్థితులతో పోల్చితే… ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కంప్లీట్ గా వేరుగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్యే పోరు అన్నట్లు సాగిపోయింది. కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. బీజేపీతో పాటు కొత్త పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయా పార్టీల అధినేతలు కూడా పబ్లిక్ లో తెగ తిరిగేస్తున్నారు. ఫలితంగా ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతాయనేది అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది.
కాంగ్రెస్ బస్సు యాత్ర… రేపోమాపో జాబితా!
మరోవైపు ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే కీలకమైన హామీలను ప్రకటించిన జనాల్లోకి వెళ్తోంది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలకు కండువాలను కప్పింది. త్వరలోనే పార్టీలోని సీనియర్లు నేతలు… బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. కలిసిగట్టుగా పని చేసి… తెలంగాణ గడ్డపై హస్తం జెండాను ఎగరవేయాలి గట్టిగా భావిస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణపై గురి పెట్టింది. కీలకమైన సీడబ్య్లూసీ భేటీ తో పాటు విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది.
ఆసక్తికరంగా బీజేపీ అడుగులు..!
రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ వచ్చిన బీజేపీ…. ఎన్నికల ఏడాదిలోకి వచ్చిన తర్వాత దూకుడు తగ్గిందనే వాదన ఉంది. ప్రధానంగా పార్టీ అధ్యక్షుడి మార్పుతో పాటు పలు పరిణామాలు ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టిసినట్లు అయిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉన్నప్పటికీ… వచ్చే ఎన్నికల కోసం గట్టిగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా వంటి జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించారు. ఇటీవలే పసుపు బోర్డు, ట్రైబల్ వర్శిటీతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ ప్రకటించి… తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనే విషయాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. వీరు ఈ మేరకు ప్రభావితం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
పొత్తులు…?
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ – కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉండేలా కనిపిస్తోంది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇక బీజేపీ కూడా ఒంటరిగానే బరిలో ఉండనుంది. బీఎస్పీ, జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీలు కూడా సింగిల్ గానే బరిలో ఉండేలా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ షర్మిల సైతం ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.మొత్తంగా చూస్తే…. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూస్తుంటే… ఎలాగైనా ఈసారి పవర్ లోకి రావాలని కాంగ్రెస్ కసితో ఉంది. రెండు పార్టీలకు కాకుండా తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది. ప్రజలను ఆలోచనలో పడేసే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్టీపీ, బీఎస్పీ,జనసేన, టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది కూడా కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే… తెలంగాణలో మరోసారి తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతుంది. అంతేకాదు దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర అవకాశం ఉంటుంది. అది ఏ రూపంలో ఉంటుందనేది అప్పటి పరిస్థితులను బట్టి అంచనా వేయవచ్చు. ఇక కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ గడ్డపై హస్తం పార్టీకి తిరుగుండదు…! కానీ మరోసారి బోల్తా పడితే మాత్రం.. కథ కంచికే అన్నట్లు ఉంటుంది. తెలంగాణలో తామే అల్టర్నేట్ అంటున్న కమలనాథులు… అసెంబ్లీ ఫైట్ లో గట్టి పరీక్షనే ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే… ఫలితాలను వచ్చేంత వరకు నిరీక్షించాల్సిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you