తెలంగాణ వీణ, సినిమా : తెలుగు, తమిళ భాషల్లో అభినయ సినిమాలు చేస్తూ వెళుతోంది. అందంగా కనిపించే ఆమెకి వినపడదనీ .. మాట్లాడలేదని తెలిసినప్పుడు ఎవరైనా సరే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అలాంటి అభినయ గురించి ఆమె తండ్రి ఆనంద్, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “అభినయకి మూడో ఏడు వచ్చేనాటికి కూడా నడవలేకపోయింది. దాంతో ఇక నడవలేదేమో అనుకున్నాము .. కానీ భగవంతుడు గట్టెక్కించాడు. అయితే, వినికిడి లోపం .. మాట్లాడలేకపోవడం అలాగే ఉండిపోయాయి. మా అమ్మాయికి ఇంత చక్కదనం ఇచ్చిన భగవంతుడు ఇలాంటి ఒక లోపం పెట్టడం చూసి మేము చాలా బాధపడేవాళ్లం. మోడలింగ్ లో మాటలతో పని లేదు గనుక, ఆ దిశగా ప్రోత్సహించాము. అయితే తను యాక్టింగ్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టింది” అని అన్నారు. “అభినయ ఆసక్తిని గమనించి నేను తన ఫొటోలు తీసుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. ‘మూగ అమ్మాయిని యాక్టింగ్ వైపు తీసుకు రావడానికి ట్రై చేస్తున్నాడు .. ఇతనికేమైనా పిచ్చి పట్టిందా’ అని విసుక్కున్న వాళ్లున్నారు .. కసురుకున్న వాళ్లున్నారు. కానీ ముందుగా ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించింది మాత్రం సముద్రఖనిగారే. అభినయ విషయంలో దేవుడు అంటే ఆయనే” అంటూ చెప్పారు.