తెలంగాణ వీణ , జాతీయం : అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుంటాయ్.. కానీ దేశంలో పెట్రో ధరలు పెరుగుతుంటాయి.. ఎందుకంటే అప్పుడు ఎన్నికలుండవ్. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీస్తే తామేం చేస్తాం.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గులే కారణమంటూ దాటవేస్తుంది. ఇప్పుడు ముడిచమురు ధరలు పెరుగుతుంటయ్.. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరుగవు.. కారణం ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటమే. ఇదీ మోదీ సర్కారు ‘ఇంధన’ రాజకీయం. ఈ విషయం ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదికలో బట్టబయలు అయ్యింది. మోదీ సర్కారు చెప్పిన ముడిచమురు అంతర్జాతీయ సూత్రీకరణ డొల్ల అని తేలింది.
నష్టాలొచ్చినా ధరలు పెంపు లేదు..
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న కారణంగా పెట్రో ధరలు పెరుగకపోవచ్చునని ‘మూడీస్’ అంచనావేసింది. దేశంలోనే 90% మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రిటైల్ సంస్థలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ 18 నెలలుగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచుతున్నాయని, నిరుడు క్రూడాయిల్ ధర భారీగా పెరిగినా.. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఈ మూడు సంస్థలకూ భారీగా నష్టాలొచ్చినా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదని పేర్కొన్నది. ఈ ఏడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. రిటైల్ సంస్థల మార్జిన్లు నెగెటివ్‌లోకి వెళ్తున్నా ఇంధన ధరల్ని పెంచకపోవడానికి కారణం రాబోయే ఎన్నికలేనని నివేదికలో వెల్లడించింది. 2023-24 ప్రథమార్థంలో ముడిచమురు బ్యారెల్ ధర 78డాలర్లు ఉండగా.. సెప్టెంబర్ నాటికి 90 డాలర్లకు చేరుకొంది.