తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి నాయకులు, కార్యకర్తల చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 350 మందికి పైగా టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. తిరుపతిలోని 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఎన్వీ రమణారెడ్డి సహా 300 మందికి పైగా టీడీపీ నాయకులకు ఆదివారం పద్మావతిపురంలో టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహా్వనించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమమే తాము వైఎస్సార్‌సీపీలో చేరడానికి కారణమన్నారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ మేలు చేస్తున్న సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్లలో గెర్లపల్లికి చెందిన టీడీపీ నాయకులు జి.రామచంద్రారెడ్డి, రమేశ్‌రెడ్డి, రాజారెడ్డి సహా 50 మంది ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు.