Sunday, November 10, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఇంతకీ అవి ఏ నిధులు బాస్‌..టీడీపీకి నో క్లారిటీ

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీకి అక్రమంగా నిధులు వచ్చాయన్నది ఏపీ సీఐడీ ఆరోపణ. స్కిల్ కార్పొరేషన్ స్కామ్ నిదులే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాలోకి జమ అయ్యాయని సీఐడీ అభియోగం మోపింది. ఆ రకంగా 27 కోట్ల రూపాయలు టీడీపీ అకౌంట్‌లోకి వచ్చాయని సీఐడీ తరపున అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి కోర్టువారి దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఆయన కోర్టుకు సమర్పించారు. దీనిపై అక్కడ టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది డూబే స్పందిస్తూ టీడీపీ ఖాతాలో డబ్బు జమ అయితే చంద్రబాబుకు ఏమి సంబంధం అని అన్నారట.

అదే లాయర్ కనుక అప్పటికప్పుడు ఆ నిధులు ఎలొక్టరల్ బాండ్లకు సంబందించిన నిధులు అని ఆధారసహితంగా చెప్పగలిగి ఉంటే చంద్రబాబుకు అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చేవారట. ఆయన ఆ వాదనవైపు వెళ్లకపోవడం విశేషంగానే కనిపిస్తుంది. కాని ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆ 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల డబ్బు అని సంక్షిప్తంగా చెప్పి, సవివరంగా ప్రకటన ఇస్తామని చెప్పి వెళ్లిపోయారట. కాని ఆ తర్వాత దాని ప్రస్తావన లేదు. తదుపరి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆ నిధులు పార్టీ సభ్యత్వ నిధులని చెప్పారు.
ఇంతకీ అవి ఎలక్టోరల్ బాండ్ల డబ్బా! లేక సభ్యత్వ నిధులా అన్నదానిపై టీడీపీలోనే స్పష్టత కొరవడిందన్నమాట. తదుపరి తెలుగుదేశం నేతలు నిమ్మల రామానాయుడు, పట్టాభిలు చేసిన ప్రకటన మరింత ఆసక్తికరంగా ఉంది. వారు అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన నిదుల వివరాలు వెల్లడించారే కాని, టీడీపీకి ఎంత మేర వచ్చాయన్నది చెప్పినట్లు కనిపించలేదు. మరికొన్ని వివరాలు ఇస్తూ 2015-16 సంవత్సరంలో పార్టీ సభ్యత్వం కింద 15.97 కోట్ల రూపాయల డబ్బు జమ అయిందని , ఆ ఏడాది సభ్యత్వాలు పెద్దగా నమోదు కాలేదని చెప్పారు. కాని 2016-17 లో మాత్రం 72.92 కోట్ల రూపాయల మొత్తం వసూలు అయితే ,అందులో సభ్యత్వ రుసుమే 60.75 కోట్లు అని వెల్లడించారు. అంటే ఒక ఏడాదిలో నాలుగు రెట్ల మేర సభ్యత్వం , తద్వారా ఆదాయం పెరిగిందని చెప్పారు. సహజంగానే దీనిపై సందేహాలు వస్తాయి. పోనీ ఈ మాట అయినా చంద్రబాబు తరపు లాయర్ ఎందుకు కోర్టుకు వివరించలేదో తెలియదు.

కోర్టులో చేయవలసిన వాదన టీడీపీ నేతలు బయట చేస్తున్నారని కొందరు వ్యంగ్యంగా విశ్లేషిస్తున్నారు. అది నిజంగా పూర్తిగా సభ్యత్వం డబ్బే అయితే, అధికారికంగా ఆయా జిల్లాల నుంచి ఆ సంవత్సరం బ్యాంకు ఖాతాల వివరాలను తెచ్చి కోర్టుకు ఇచ్చి ఉండవచ్చు కదా! కాని ఆ పని కూడా ఎందుకు చేయలేదో తెలియదు.ముందుగా అచ్చెన్నాయుడు అవి ఎలక్టోరల్ బాండ్ల డబ్బు అని ఎందుకు చెప్పారు? తదుపరి లోకేష్ కాని, ఇతర నేతలు కాని అది పార్టీ సభ్యత్వ సొమ్ము అని ఎందుకు చెబుతున్నారు.సీఐడీ చెబుతున్న వాదన చూస్తే, అది షెల్ కంపెనీల నుంచి వచ్చిన సొమ్ము అని ,నగదు రూపంలో అధిక మొత్తం జమ అయిందని తేలుతోంది. నిజంగా సీఐడీ వద్ద తగు ఆధారాలు లేకుండా కోర్టుకు తెలియచేస్తే వారు ఇబ్బంది పడతారు.
దాని ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుంది. ఈ విషయంలో సీఐడీ వాదన పూర్తి క్లారిటీతో, ఒకే మాటపై ఉంటే, తెలుగుదేశం వాదన ఎప్పటికప్పుడు మారుతోంది.అది సందేహాలకు తావిస్తోంది. పైగా తమకు ఎవరెవరు ఎంత ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లేదా, విరాళాల ద్వారా డబ్బు ఇచ్చారో చెప్పవలసిన తెలుగుదేశం నేతలు ఆ పని చేయకుండా వైసికి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల గురించి ఎదురు దాడి చేశారు. అక్కడే వారు డిఫెన్స్ లో పడుతున్నారు.దేశంలో ఈ బాండ్ల విధానం గత కొన్నేళ్లుగా అమలు అవుతోంది. బిజెపికి ప్రతి ఏడాది వెయ్యి కోట్లకు పైగానే ఈ బాండ్ల ద్వారా సొమ్ము జమ అవుతోంది.కాంగ్రెస్ పార్టీకి 400 కోట్లకు పైగా వస్తోంది. అదేమీ రహస్యం కాదు.తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపి, కాంగ్రెస్ ల బాండ్ల డబ్బు గురించి మాట్లాడకుండా వైసీపీపైనే విమర్శలు చేశారు.దానికి క్విడ్ ప్రోకో అని ఆరోపించి తమకు వచ్చిన అవినీతి సొమ్ము అభియోగాలను దారి మళ్లించాలని ప్రయత్నించారు.

వైసీపీకి అధికారికంగా వచ్చిన నిధులు అవి. అందులో తప్పు లేదు. మెఘ కంపెనీ బాండ్ల ద్వారా 22 కోట్లు ఇచ్చింది కాబట్టి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చారా అంటూ బోడిగుండుకు, మోకాలికి లింక్ పెట్టి మాట్లాడారు. నిజానికి గతంలో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంచేసి నామినేషన్ పద్దతిపై నవయుగ కంపెనీకి ఇచ్చేశారు. కాని వైసీపీ అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసి రివర్స్ టెండర్ ద్వారా సుమారు 800 కోట్లు ఆదా చేశారు. అలా కాంట్రాక్టును టెండర్ ద్వారా ఇస్తే అది ఎలా క్విడ్ ప్రోకో అవుతుంది. పైగా కాంట్రాక్ట్ వ్యయాన్ని 800 కోట్లు తగ్గించినందుకు విరాళం ఇస్తారా? ఏదో ఒక పిచ్చి ఆరోపణ చేయడమే తప్ప, తమకు వచ్చిన విరాళాలు, బాండ్లు గురించి ఎందుకు టీడీపీనేతలు ఓపెన్ చేయడం లేదు.
ఏ ఏ కంపెనీల ద్వారా టీడీపీకి డబ్బు వచ్చిందో ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగుదేశం మీడియా సీఐడీ తరపు న్యాయవాది చేసిన 27 కోట్ల ఆరోపణకు ప్రాధాన్యం ఇవ్వకుండా, టీడీపీ నేతలు చేస్తున్న పిచ్చి ఆరోపణలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి,వాటికి విశ్వసనీయత కల్పించడానికి పడుతున్న పాట్లను గమనిస్తేనే ,ఇందులో అవినీతి ఉందన్న భావన కలుగుతుంది.సీఐడీ చెబుతున్నట్లు నగదును కోట్ల రూపాయలలో జమ చేసి ఉంటే సంబంధిత బ్యాంకులు కూడా బాద్యత వహించవలసి ఉంటుందని చెబుతున్నారు. ఇరవై రోజుల తర్వాత డిల్లీ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన లోకేష్ కూడా యధాప్రకారం తన తండ్రిపై అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు.ఆ విషయాన్ని కోర్టులో రుజువు చేసి ఉంటే ఈపాటికి చంద్రబాబు విడుదల అయ్యేవారు కదా అన్నది సామాన్యుడికి వచ్చే ప్రశ్న.మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. వైసీపీ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా జైలులో ఉంచుతున్నారని ఆయన అంటున్నారు.

బహుశా గతంలో టీడీపీ వారు చేసిన మేనేజ్ మెంట్ వ్యవహారాలు గుర్తుకు వచ్చి ఉండాలి.నిజానికి జగన్ కు కాని, వైసీపీ నేతలకు కాని అంత శక్తే ఉంటే టీడీపీ వారు నిత్యం హైకోర్టులో వేసిన అనేక వ్యాజ్యాలలో ఎదురు దెబ్బ ఎందుకు తినేవారు! ప్రజా ప్రయోజనాల విషయాలలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాకుండా చేయగలిగారే. ఆ ధైర్యంతోనే కదా.. టీడీపీ కార్యకర్తలు ,నేతలు ఎవరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తానని లోకేష్ చెబుతూ వచ్చారు. జైలుకు వెళ్లే టీడీపీ వారిని గంటల వ్యవధిలోనే బయటకు తీసుకు వస్తామని చంద్రబాబు, లోకేష్ లు ఎలా భరోసా ఇస్తుండేవారు.చాలా కాలం అలా చేయగలిగారు కూడా.చంద్రబాబుకు ఆయా వ్యవస్థలలో ఉన్న పరపతి గురించి అంతా బహిరంగంగానే మాట్లాడుకుంటారు కదా! అలాంటిది ఇప్పుడు జగన్ పై లోకేష్ ఆరోపణ చేయడం విడ్డూరమే అని చెప్పాలి. ఇంతకీ ఆ 27 కోట్లు ఎక్కడనుంచి వచ్చాయో నిర్దిష్ట ఆధారాలతో సహా కోర్టుకు, అలాగే ప్రజాకోర్టుకు చూపిస్తే తెలుగుదేశంకు నైతిక స్థైర్యం వచ్చేది. అలా చేయకుండా ప్రత్యారోపణలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటే వారు ఇందులో గట్టిగానే ఇరుక్కున్నారనిపిస్తుంది. కేవలం తమ పార్టీవారినైనా మభ్య పెట్టడం కోసం ఇలా ప్రతి విమర్శలు, నిరసనలు అంటూ కాలం గడుపుతున్నట్లుగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే 27కోట్ల వ్యవహారం తెలుగుదేశం పార్టీపై పడిన పెద్ద బాంబు వంటిదని చెప్పాలి. అది పూర్తి స్థాయిలో విస్పోటనం అయితే ఆ పార్టీ పెను సంక్షోభంలో పడే అవకాశం కూడా ఉంటుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you