తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండే అంశాలతో ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మం గురించి మాట్లాడితే ప్రయోజనం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. 2014తో పోల్చితే పదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధికి వేరే ఏ రాష్ట్రమూ సాటిరాదన్నదని వారి కి అవగతమైంది. బీజేపీ పాలిత రాష్ర్టాలేవీ కేంద్రం ఇచ్చే ఏ ర్యాకింగ్స్‌లోనూ, అవార్డుల్లోనూ తెలంగాణ దరిదాపుల్లో లేవు. ఈ నేపథ్యంలో కుటుంబపాలన, అవినీతి గురించి మాత్రమే మాట్లాడాలని నేతలకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతోపాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ఇలా రాష్ర్టానికి వచ్చినవారంతా అవినీతి, కుటుంబపాలన తప్ప మరొకటి మాట్లాడటం లేదు.
తెలంగాణకు కేంద్రం నుంచి ఏం చేశామో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో మాటవరుసకైనా చెప్పడం లేదు. వాస్తవానికి బీజేపీ ఎంచుకున్న రెండు అంశాలను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. అవినీతిపై బీజేపీ చేసేదంతా డొల్ల ప్రచారమని ప్రజలు అర్థం చేసుకున్నారు. నిజంగా అవినీతి జరిగితే కేంద్రం ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా తెలంగాణ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. అయినా మూడో ముచ్చటే వద్దని పదే పదే ఈ రెండు అంశాలనే ప్రస్తావించి, గోబెల్స్‌ను మించి ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నది.
పొత్తుల కోసం పాకులాట
రాష్ట్రంలో 119 నియోజవకర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు దొరుకడం లేదు. గట్టిగా 30-40 నియోజకవర్గాల్లో మాత్రమే కాస్త పేరున్న నేతలు ఉన్నారని, మిగతా చోట్ల జల్లెడపట్టి వెదికినా నాలుగు ఓట్లు సంపాదించేవాళ్లు కనిపించడం లేదని పార్టీ వర్గా లు చెప్తున్నాయి. దరఖాస్తుల పేరుతో హడావుడి చేసినా ప్రయోజనం కలుగలేదని చె ప్పుకుంటున్నారు. ‘రాష్ట్ర నేతలు కోరారు కాబట్టి.. హడావుడి కోసం దరఖాస్తు చే శాం. పోటీ అంటే మా వల్ల కాదు’ అని దరఖాస్తుదారులు చెప్తున్నట్టు సమాచారం. దీంతో 70-80 స్థానాల్లో పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను మినహాయించి మిగ తా పార్టీలపై దృష్టిపెట్టారు. వామపక్షాలు, వైఎస్సార్‌టీపీ వంటివి కాంగ్రెస్ వైపు చూ స్తున్నాయి. మంగళవారం అమిత్‌షా పర్యటన అనంతరం మందకృష్ణ మాదిగ నుంచి తమకు అనుకూలంగా ప్రకటన వస్తుందన్న ఆశతో బీజేపీ నేతలు ఉన్నారు. ఆయనతో పొత్తు పెట్టుకొని 30-40 సీట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.