తెలంగాణ వీణ , హైదరాబాద్ : సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఇలా మొత్తం 11 క్యాటగిరీల వారికి సామాజిక భద్రతను కల్పిస్తూ మానవీయతను ప్రదర్శిస్తున్నది. వారికి ప్రతి నెలా పింఛన్లు అందజేస్తూ ‘ఆసరా’గా నిలుస్తున్నది. ‘మీకు మేమున్నాం’ అన్న భరోసాను కల్పిస్తున్నది. లక్షలాది పేదలు, విధి వంచితులు ఆత్మగౌరవంతో జీవించేలా తోడ్పాటునందిస్తున్నది. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆటుపోట్లు ఎదురైనా రాజధర్మాన్ని విస్మరించలేదు. అన్నార్తులను, అభాగ్యులను ఆదుకునే విషయంలో మరింత మానవీయతను ప్రదర్శించింది. ఇతర రాష్ర్టాలకూ ఆదర్శంగా నిలిచింది. ‘పింఛన్ అంటే భిక్ష కాదు. ఈ సమాజ పురోగాభివృద్ధికి, దేశ సంపదల సృష్టికి జీవతమంతా వారు చేసిన శ్రమకు వినమ్రతతో అందిస్తున్న ప్రతిఫలం..’ అన్న స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఇవాళ రాష్ట్రంలో లక్షలాది వృద్ధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ పెద్ద కొడుకుగా భావించి అభిమానిస్తున్నారు.
తెలంగాణలో 11 వర్గాలకు పింఛన్లు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు కేవలం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు అనే ఐదు క్యాటగిరీలకు మాత్రమే పింఛన్ అందిస్తున్నాయి. తెలంగాణ 11 క్యాటగిరీలకు పింఛన్లు వర్తింపజేస్తుండటం సీఎం కేసీఆర్ మానవీయ కోణానికి మరో నిదర్శనం. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, చేనేతకార్మికులతోపాటు ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, డయాలసిస్ పేషంట్లు, గీత కార్మికులు, వృద్ధకళాకారులు, బీడీ కార్మికులకు సైతం పింఛన్ల పథకాన్ని వర్తింపజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
ఆదాయ పరిమితి పెంపు
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ తదితర అనేక రాష్ర్టాలు పింఛన్ పథకానికి అర్హుల ఎంపికలో అనేక ఆంక్షలను విధిస్తున్నాయి. అందులో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి ప్రధానమైనది. చాలా రాష్ర్టాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల వార్షిక ఆదాయం మించితే వారికి పింఛన్ ఇవ్వడం లేదు. వయసు తదితర అంశాల్లో సవాలక్ష పరిమితులను విధించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ ఉదారంగా వ్యవహరిస్తూ మానవీయతను చాటుకుంటున్నది. వీలైనంత ఎక్కువ మంది అభాగ్యులకు లబి ్ధచేకూర్చడమే పరమావధిగా పథకాలను అమలు చేస్తున్నది. పింఛన్లకు వార్షిక ఆదాయ పరిమితిని మరే రాష్ట్రంలోనే లేనివిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలుగా నిర్ణయించడం సీఎం కేసీఆర్ మానవీయతకు నిదర్శనం. వృద్ధుల పింఛన్ అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదించడం మరో విశేషం. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాల ఫలితంగానే రాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం 29 లక్షలకు మించని పింఛన్‌దారుల సంఖ్య నేడు 44 లక్షలు దాటింది.
తెలంగాణ
వృద్ధాప్య పింఛన్ అర్హత కనీస వయస్సు 57 ఏండ్లు. ఇచ్చే మొత్తం రూ.2,016.
వితంతువుల పింఛన్ అర్హత వయసు 18-57 ఏండ్లు. అందించే మొత్తం రూ.2,016.
దివ్యాంగుల పింఛన్ అర్హత కనీస వయసు 5 ఏండ్లు. వైకల్యశాతం 40 శాతం. అందించే మొత్తం రూ.3,016.
అన్నింటికీ మించి గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.