తెలంగాణ వీణ, సిటీబ్యూరో : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోన్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15 నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది. ఈ బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ ప్రారంభించనున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో జరిగే బస్సుయాత్రలో ప్రియంకా గాంధీ పాల్గొంటారు. ఈనెల 19, 20, 21 తేదీల్లో జరిగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు బస్సు యాత్రలలో పాల్గొననున్నారు. ఈ నెల 10వ తేదీన జరగబోయే పీఏసీ సమావేశంలో బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్‌ను టీపీసీసీ ఖరారు చేయనుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే బస్సు యాత్ర నిర్వహించే ముఖ్యమైన ప్రాంతాల్లో రాహుల్ గాంధీ, ఖర్గే పర్యటించేలా ప్రణాళికను టీపీసీసీ రూపొందించనుంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఆరు గ్యారంటీ స్కీమ్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ భావిస్తోంది.