తెలంగాణ వీణ, హైదరాబాద్ : ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ వచ్చే ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ స్పందించారు.వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేస్తూ ఎక్స్ చేశారు. తనకు టికెట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారని, కానీ తాను సున్నితంగా తిరస్కరించినట్టు తెలిపారు. తనకు టికెట్ కంటే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యమని పేర్కొన్నారు. అందుకోసం తాను పనిచేస్తానని తెలిపారు. రేవంతన్న ప్రేమకు తాను కృతజ్ఞుడినని పేర్కొన్న ఆయన.. టికెట్ కోసం తాను దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు. రేవంత్ నాయకత్వంలో పనిచేస్తామని, ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని బండ్ల గణేశ్ వివరించారు.