తెలంగాణ వీణ , జాతీయం : బీహార్ ప్రభుత్వం కుల గణన సమాచారాన్ని వెల్లడించకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కోర్టు పరిశీలనలో ఉండగా సర్వేకు సంబంధించిన వివరాలను ఎందుకు వెల్లడించారని బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగిలిన డాటాను ప్రజా బాహుళ్యానికి వెల్లడించకుండా ఆదేశాలివ్వడానికి నిరాకరిస్తూ.. ఒక వేళ డాటాకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే దానిని పరిశీలిస్తామని పేర్కొంది.
బీహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను కొనసాగించవచ్చంటూ పాట్నా హైకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. న్యాయస్థానంలో విచారణలో ఉండగా బీహార్ ప్రభుత్వం సర్వే వివరాలు విడుదల చేయడాన్ని ప్రశ్నించిన పిటిషనర్లు, తదుపరి వివరాలు ప్రకటించకుండా అడ్డుకోవాలని సుప్రీంని కోరారు. దీనికి నిరాకరించిన సుప్రీం.. ప్రభుత్వ చర్యను తాము నిరోధించమని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పరిశీలిస్తామని పేర్కొంది.