తెలంగాణ వీణ , జాతీయం : తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. సిక్కింతో పాటు ఇటు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కిం వరదల్లో ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. వీరిలో ఏడుగురు సైనికులు ఉన్నారు. గల్లంతై ఇంకా ఆచూకీ తెలియని 142 మంది కోసం మూడో రోజైన శుక్రవారం ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు కొనసాగింది.
1,173 నివాసాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని సిక్కిం గవర్నమెంట్ వెల్లడించింది. 2,413 మందిని రక్షించినట్లు తెలిపింది. తీస్తా – వీ హైడ్రో పవర్ స్టేషన్‌కు దిగువన ఉన్న బ్రిడ్జిలన్ని ధ్వంసమయ్యాయి. కొన్ని వంతెలు వరదలకు కొట్టుకుపోయాయి. నార్త్ సిక్కింలో కమ్యూనికేషన్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నిన్న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్షించారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దెబ్బతిన్న రోడ్లను వీలైనంత వరకు పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.