తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై ఆందోళనగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాబుతో ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి శుక్రవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వద్ద లోకేశ్ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి జైలుపై దాడి చేస్తామని మావోయిస్తులు లేఖ రాశారన్నారు. అదే సమయంలో బాబు పైనా దాడి జరగవచ్చని అన్నారు. జైలుపై డ్రోన్ ఎగరేశారని చెప్పారు. జైలులో నక్సల్స్, గంజాయి బ్యాచ్ ఖైదీలుగా ఉన్నారన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే బాబుకు జైల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు.
పోలవరం, ఇసుక, మద్యం, మైన్స్‌లో అవినీతిని ప్ర శ్నించినందుకే దొంగ కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. íకక్ష సాధింపు కోసం, వ్యవస్థలను మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచారన్నారు. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందన్నారు. ఆ నాడు చంద్రబాబు చిటికేస్తే పిచ్చి జగన్ పాదయాత్ర చేసేవాడా.. అని ప్రశ్నించారు. 2014, 2016, 2018, 2022 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్కరి నుంచి రూ.100 సభ్యత్వం చేయించామని, 1,300 బ్రాంచిల ద్వారా డబ్బు వసూలు చేసినట్లు వెల్లడించారు. టీడీపీ ఆడిటింగ్ అడుగుతున్నారని, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు మా అకౌంట్స్ సబ్‌మిట్ చేస్తామన్నారు.
వారి పార్టీకి కూడా డబ్బులు ఎవరు ఇచ్చారో ఆధారాలు బయటపెట్టాలన్నా. కృష్ణా జలాలను జగన్ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాబు అరెస్టులో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు అందరూ కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లతో సంఘీభావం తెలపాలన్నారు. ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి ఇంటి ముందు కొవ్వొత్తులు వెలిగించాలని కోరారు. కాగా, లోకేశ్ మళ్లీ శనివారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి.