తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి మండలం నిడిమామిడి నుంచి గంట్ల మారెమ్మ ఆలయం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మద్యం, డబ్బులు ఎరగా వేశారు. ఈ క్రమంలోనే గాజులపల్లికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. కానీ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేకే అతను గుండె ఆగి చనిపోయినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఎల్లో మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి.
వారం రోజుల క్రితం పెనుకొండలో బీకే పార్థసారథి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే వారందరూ ఆరంభం నుంచి టీడీపీ వెంట నడిచిన వారేనని తేలింది. అయితే కొంతకాలంగా సవితమ్మ వర్గంలో ఉన్న వారంతా ఇప్పుడు బీకే పార్థసారథి వైపు వచ్చారని తెలిసింది. అలాగే నాలుగు కుటుంబాలు మాత్రమే టీడీపీలో చేరగా.. 40 కుటుంబాలు చేరినట్లు ప్రచారం చేశారు. ఫొటోల్లో జనం భారీగా కనిపించాలన్న ఉద్దేశంతో టీడీపీ కార్యాలయంలోని వారందరికీ కండువాలు వేసి ఫొటోలకు ఫోజులివ్వడం గమనార్హం.
సాక్షి, పుట్టపర్తి: అధినేత అవినీతి కేసులో జైలు పాలయ్యాడు.. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. నిరసన, ధర్నాలకు పిలుపునిచ్చినా కార్యకర్తలు కన్నెత్తి చూడటం లేదు. ఏం చేయాలో తెలియని పచ్చ తమ్ముళ్లు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీ కార్యకర్తలకే మళ్లీ కండువాలు వేసి టీడీపీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్లో మీడియాలోనూ అవే వార్తలు కనిపిస్తుండటంతో జనం నవ్వుకుంటున్నారు.
వాపును బలుపుగా ప్రచారం..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో చాలా మంది టీడీపీ నేతలూ లబ్ధి పొందుతున్నారు. దీంతో వారంతా ఒక్కొక్కరుగా ఫ్యాన్ కిందకు చేరుతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాప్తాడు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. గ్రామాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నారు. దీంతో ‘తమ్ముళ్ల’కు వణుకు పట్టుకుంది. అవినీతి కేసులో చంద్రబాబు జైలు వెళ్లడం…టీడీపీ ముఖ్య నేతలు కూడా తలోదారి చూసుకుంటున్నట్లు వార్తలు వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమనే భావన కార్యకర్తల్లోకి వెళ్లిపోయింది. అందువల్లే మండల స్థాయి నేతలంతా వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం వాపును బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘తెలుగు తమ్ముళ్ల’కే మళ్లీ కండువాలు కప్పుతూ కొత్తగా టీడీపీలో చేరారంటూ గొప్పలు పోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం తెలిసిన జనం మాత్రం వీరి చర్యలు చూసి నవ్వుకుంటున్నారు.
ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే..
కిందపడినా మాదే పైచేయి అన్నట్లుగా ఉంది టీడీపీ నేతల పరిస్థితి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయగా.. కోర్టు సైతం ఆయనకు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. దీన్ని చూపి సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏ కారణంతో ఎవరు మరణించినా.. వెంటనే ‘చంద్రబాబు అరెస్టు’ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జిల్లాలో నాలుగైదు వెలుగు చూశాయి. ఓట్ల వేటలో టీడీపీ నేతల కక్కుర్తి వ్యవహారాలు నచ్చక చాలా మంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు.
ఉనికి కోసమే
చంద్రబాబు జైలుకెళ్లాడు.. లోకేష్ పారిపోయాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం జగనన్న ప్రభుత్వంలో కుదరదు. ఇక ఆ అవినీతి పరుడు జైల్లో ఉండాల్సిందే. టీడీపీ జీరో అయింది. అందువల్లే ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. కానీ విజ్ఞులైన జనం అంతా గమనిస్తున్నారు.
– గోరంట్ల మాధవ్, ఎంపీ, హిందూపురం
నలుగురు కూడా చేరలేదు
మా గ్రామం నుంచి 25 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ వారందరూ టీడీపీలో ఉన్నవాళ్లే. అయితే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న భయంతో వారికి కండువాలు కప్పి కొత్తగా టీడీపీలో చేరినట్లు బీకే పార్థసారథి ప్రచారం చేశారు. కనీసం నలుగురు కూడా టీడీపీలో చేరలేదు.
– రామాంజనేయులు, కురుబవాండ్లపల్లి