Wednesday, December 25, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వడి వడిగా… కలివిడిగా..

Must read

తెలంగాణ వీణ ,హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం వరంగల్‌ నగరంలో సుడిగాలి పర్యటన జరిపారు. రూ.900కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఒకటీ రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ జారీకానున్న నేపథ్యంలో వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల పరిధి కలిగిన గ్రేటర్‌ వరంగల్‌లో ఆయన పర్యటన బిజీబిజీగా సాగింది. కేటీఆర్‌ తన పర్యటన సందర్భంగా ఈ రెండు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

వచ్చే ఎన్నికల్లోనూ పశ్చిమ, తూర్పు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేసి బీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మంత్రి కేటీఆర్‌ తన పర్యటనలో ఆద్యంతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గణాంకాలతో సహా విడమరిచి చెప్పారు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను సభావేదికలపై నుంచి ప్రజలకు పరిచయం చేస్తూ వారు చేసిన అభివృద్ధిని చూసి మరో సారి ఓటేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు.

రూ.900 కోట్ల పనులు

మంత్రి కేటీఆర్‌ పర్యటన గంట ఆలస్యంగా మొదలైంది. పర్యటన షెడ్యూల్‌లో చివరి నిమిషంలో మార్పులు జరిగాయి. ఆయన పాల్గొనే కార్యక్రమాల క్రమం కూడా మారింది. ఉదయం 10.15 గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా సుబేదారిలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కాలేజీ మైదానంలో దిగారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్‌ తొలుత హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే రావడం ఆలస్యం కావడంతో మంత్రి దయాకర్‌ రావు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కేటీఆర్‌ నగరానికి చేరుకోగానే మొదట హనుమకొండ బంధం చెరు వు వద్ద రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ (ఎస్‌టీపీ)ని, అక్కడే బస్తీ దవాఖానను, రూ.30లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన నిట్‌ జంక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మడికొండలోని ఐటీ పార్క్‌లో క్వాడ్రాంట్‌ సాప్ట్‌వేర్‌ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించారు. హనుమకొండ సర్క్యూట్‌ హౌస్‌ రోడ్డులో రూ.7కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సను ప్రారంభించారు. వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. హనుమకొండ బస్‌స్టేషన్‌లో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునాతన భవనానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం హనుమకొండ హయగ్రీవచారి మైదానం (కుడా గ్రౌండ్‌)లో బహిరంగ సభలో పాల్గొన్నారు. హనుమకొండ బాలసముద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు కేశవరావు నివాసంలో మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం రూ.30లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన హనుమకొండ అలంకార్‌ జంక్షన్‌ను, పోతన నగరంలో రూ.3కోట్లతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను, రూ.4 కోట్లతో అందుబాటులోకి తెచ్చిన ల్యాండ్రోమార్ట్‌ను, స్మార్ట్‌ లైబ్రరీని ప్రారంభించారు. భద్రకాళి ఆర్చి జంక్షన్‌ వద్ద రూ.43కోట్లతో నిర్మించనున్న ఉన్న భద్రకాళి బండ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, ప్లానెటోరియం, రూ.250కోట్ల టీయూఎ్‌ఫఐడీసీ నిధులతో చేపట్టనున్న పనులకు, మున్నూరు కాపు భవనానికి శంకుస్థాపనలు చేశారు.

తర్వాత హనుమకొండలో పోలీసు భరోసా కేంద్రాన్ని, రూ.5.30కోట్ల వ్యయంతో పద్మాక్షి రోడ్డులో నిర్మించిన కేసీఆర్‌ భవనాన్ని (రజక) ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు ఖిలా వరంగల్‌లోని వాకింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు మామునూరు ఎయిర్‌ పోర్టు నుంచి హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.

అంతకుముందు మడికొండలో ఆశా వర్కర్ల యూనియన్‌ నేతలపై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ఎన్నికల సందు చూసుకొని మెడపై కత్తిపెడతారా? పనికి మాలినోళ్లు.. పనికి మాలిన సంఘాలు.. అంటూ ఆశావర్కర్ల సంఘం ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు తగదంటూ హితవు పలికారు. ఇదే సందర్భంలో కేయూ విద్యార్థి సంఘాల నాయకులు పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలపై కొద్దిరోజులుగా తాము చేస్తున్న ఆందోళనను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. దీంంతో వారం రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని సీపీ రంగనాథ్‌ను ఆదేశించారు.

బీజేపీ కాంగ్రె్‌సపై ధ్వజం

తన పర్యటనలో భాగంగా కుడా గ్రౌండ్‌లో, ఖిలా వరంగల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన రెండు బహిరంగ సభల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తుండడంతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సంక్రాంతికొకసారి గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నా కాంగ్రెస్‌, బీజేపీ సన్నాసులకు కనిపించడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌పై ప్రశంసలజల్లు కురిపించారు. అన్నా.. అని వెళితే ఏ సాయం అయినా చేసే ఆయనను మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

మంత్రి వెంట పర్యటనలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ గుండు సుధారాణి, రైతు రుణ విముక్తి కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, ‘కుడా’ చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, జీడబ్ల్యుఎంసీ కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా, పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you