తెలంగాణ వీణ, భద్రాద్రి : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. అశ్వాపురం మండలం జగ్గారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సి ఎమ్ అల్ఫాహర పథకంలో పాల్గొని విద్యార్థులకు అల్ఫాహారం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఈ పథకం ద్వారా పోషకాలతో కూడిన అల్పాహారం అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందిస్తున్న ప్రభుత్వం ఉదయం విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు ఈ అద్భుత పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. పేద విద్యార్థుల ఆకలి బాధను తీర్చాలనే సంకల్పంతో ఈ అల్పాహార పథకం అమలు చేయనున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుజాత తదితరులు పాల్గొన్నారు.