తెలంగాణ వీణ ,హైదరాబాద్ : నాయకనేరి పంచాయతీ సర్పంచ్ పదవి వ్యవహారంపై హైకోర్టు ఉత్తర్వులు తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ దుమ్మెత్తి పోయడం బాధాకరమని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ సమాచార ప్రతినిధిగా మాట్లాడుతూ, రాష్ట్రంలో సామాజిక న్యాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఆయన పదవికి తగదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్ హితవు పలికారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో 12,525 పంచాయతీల్లో 4,357 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించామన్నారు. వారిలో తిరుపత్తూర్ జిల్లా నాయకనేరి పంచాయతీ సర్పంచ్ పదవీ వ్యవహారం న్యాయస్థాన పరిధిలో ఉందన్నారు. పోటీ లేకుండా ఏకగ్రీవమైనట్లు రాష్ట్రప్రభుత్వ న్యాయవాది తెలిపారని, కేటాయించిన సీటుకు ఆ వర్గానికి చెందిన వారు కాదని పేర్కొన్న న్యాయస్థానం.. ఆ వ్యక్తి పదవి చేపట్టరాదని 2021 అక్టోబరు 7న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ద్రావిడ పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయం కొనసాగుతోందని, కానీ, వాటిని సహించని బీజేపీ, ఇతర సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప, ఆయనకు ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి శ్రద్ధ లేదని విమర్శించారు. ఆయనకు నిజంగా శ్రద్ధ ఉంటే.. అన్ని కులాల వారు పూజారులయ్యే చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినవారిని మందలించవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికంగా అంటరానితనం ఘటనలపై స్పందించని గవర్నర్.. హైకోర్టు ఉత్తర్వుల్లో ఉన్న ఒక పంచాయతీపై మాత్రం మాట్లాడడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్ పాలనలో సామాజిక న్యాయంతో కూడిన పాలన సాగుతోందని, గతంలో ఆయన పురపాలక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించలేని పంచాయతీల్లో కూడా ఎన్నికలు జరిపి సామాజిక న్యాయం చేసి చూపారని గుర్తు చేశారు. 2013-20 మధ్య ఎస్సీ, ఎస్టీలపై జరిగిన హింసాత్మక కేసుల్లో శిక్షల శాతం 7.15 శాతం ఉండగా, తమ ప్రభుత్వ హయాంలో 2021-23 వరకు 9.12 శాతానికి పెరిగిందని తెలిపారు. గవర్నర్ ఇకనైనా రాష్ట్రప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని మంత్రి దురైమురుగన్ హితవు తెలిపారు.