తెలంగాణ వీణ ,హైదరాబాద్ : నల్లబంగారు సిరులను కడుపులో దాచుకొన్న సింగరేణి కాలరీస్ పూర్తిగా తెలంగాణకు చెందుతుందని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. సింగరేణిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. ఏపీలో సింగరేణికి ఎలాంటి బొగ్గు గనులు లేనందున, ఆ సంస్థ పూర్తిగా విస్తరించి ఉన్న తెలంగాణకే అది సొంతమని అటార్నీ జనరల్ తేల్చటంతో ఆయన సలహాను తుది నిర్ణయంగా పరిగణిస్తున్నామని చెప్తూ దాదాపు దశాబ్దకాలంగా నలుగుతున్న సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఉమ్మడి ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత రెండు రాష్ర్టాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన సందర్భంలో సింగరేణిలో తమకూ వాటా ఉన్నదని ఏపీ వాదించింది. సింగరేణిపై సర్వహక్కులూ తెలంగాణకే చెందుతాయని కేంద్ర హోం శాఖ ఎట్టకేలకు ప్రకటించింది.
రాష్ట్ర విభజన సమస్యల్లో ఒకటైన సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచి ఒకే మాటపై ఉన్నది. చట్టంలోని నిబంధనల ప్రకారం సింగరేణి తెలంగాణదేనని వాదిస్తూ వచ్చింది. బొగ్గు గనులన్నీ తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రానికి స్పష్టం చేస్తూ వస్తున్నది. విభజన సమస్యలపై ఏర్పాటుచేసిన ప్రతి సమావేశంలోనూ తెలంగాణ ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించింది. అటార్నీ జనరల్ కూడా తెలంగాణ వాదనే నిజమని తేల్చారు. సింగరేణి సంస్థకు తెలంగాణలోనే బొగ్గు గనులున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో లేవని కేంద్ర బొగ్గుశాఖ నుంచి కూడా వివరాలు తీసుకున్నామని హోంశాఖ పేర్కొన్నది. ఒడిశాలోని నైనీలో మాత్రమే సింగరేణికి బొగ్గు గని ఉన్నదని, అదికూడా కోల్‌మైన్స్ (స్పెషల్ ప్రొవిజన్) యాక్ట్, 2015 ప్రకారం కేటాయించిందేనని, మిగతా గనులన్నీ తెలంగాణ భూభాగంలోనే ఉన్నాయని తెలిపింది.