తెలంగాణ వీణ , జాతీయం : రాష్ట్రంలో అధికారంలో ఉన్నది డీఎంకే. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. పోటీ మా రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. 2024 ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సవాల్ విసిరారు. అమింజికరైలోని ప్రైవేటు కల్యాణ మండపంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నిర్వాహకుల సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అన్నామలై, సీనియర్ నేతలు పొన్.రాధాకృష్ణన్, హెచ్.రాజా, వానతి శ్రీనివాసన్, కేశవ వినాయకం, రాష్ట్ర ఉపాధ్యక్షులు కరు.నాగరాజన్, కేపీ రామలింగం, ఎం.చక్రవర్తి, వీపీ దురైస్వామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అన్నామలై మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీపై నిర్ణయం తీసుకున్నారా? అంటూ విలేకరులు ప్రశ్నించగా .. ‘‘ఆ విషయం మీడియాకు ఎందుకు చెప్పాలి? సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని నేరుగా రాష్ట్ర ప్రజలకు చెబుతాం. 2024 ఎన్నికలు ఎలా ఎదుర్కొవాలనే విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించాల్సిన సమయం కాదు. పార్టీ నేతల మధ్య చర్చించాల్సిన విషయం’’ అని స్పష్టం చేశారు. బీజేపీ వరకు, ఎన్డీఏ కూటమి 1998 నుంచి 25 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. చాలా పార్టీలు కూటమిలో చేరుతుండగా, మరికొన్ని వెళ్లిపోతున్నాయన్నారు. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ కోసం రాష్ట్రం నుంచి అధికసంఖ్యలో ఎంపీలను పంపాల్సి ఉందన్నారు. ఆ ఎన్నికల్లో తమ పార్టీ బలం తెలుస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 సీట్లు నరేంద్ర మోదీ పక్షానికి చెందుతాయని జోస్యం చెప్పారు. కూటమి నుంచి ఓ పార్టీ వెళ్లిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి పార్టీ తాము బలోపేతం కావడం కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు చేస్తుంటాయన్నారు. ఒక పార్టీ వెళ్లిపోయినంత మాత్రాన ఇతరులకు గెలుపు సాధ్యం కాదనే మాటలకు అర్ధం లేదన్నారు. వచ్చే ఏడు నెలలు పార్టీ బలోపేతానికి ముఖ్యమైన కాలమన్నారు. రెండున్నరేళ్ల అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టనున్నామన్నారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి తద్వారా వారి ఓట్లు పొందేలా కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు. బూత్ కమిటీల్లో మహిళలు కూడా అధికంగా ఉండేలా జిల్లా నేతలు చర్యలు చేపట్టాలని కోరారు. ‘ఎన్ మన్…ఎన్ మక్కల్’ పేరుతో తాను చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, పాదయాత్ర ముగింపు రోజున చెన్నైలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని అన్నామలై తెలిపారు.
కోర్టుకు హాజరైన అన్నామలై…
డీఎంకే ఎంపీ టీఆర్ బాలు దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు అధ్యక్షుడు అన్నామలై గురువారం సైదాపేట కోర్టులో హాజరయ్యారు. డీఎంకే ప్రముఖులు 12 మంది ఆస్తుల వివరాల చిట్టాను అన్నామలై విడుదల చేయడంతో పాటు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా ఆ పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిపై వివరణ కోరుతూ డీఎంకే అధిష్ఠానం జారీచేసిన నోటీసుకు అన్నామలై నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో, సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు దాఖలుచేసిన కేసులో జూన్ 14న అన్నామలై హాజరుకాగా, తదుపరి విచారణ గురువారం కూడా హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబరు 9వ తేదీకి న్యాయమూర్తి వాయిదావేశారు.