తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అనేందుకు ఆధారాలను సీఐడీ ఒక్కొక్కటిగా కోర్టు ముందుంచుతోంది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గురువారం ఏసీబీ న్యాయస్థానం ముందుంచారు.
ఈ కుంభకోణం ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని ఏఏజీ స్పష్టంచేశారు. దారి మళ్లించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరాయని చెప్పారు. అందులో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని చెబుతూ ఆ రికార్డులను న్యాయస్థానానికి సమర్పించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయకూడదని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వరుసగా రెండో రోజు గురువారం విచారించింది. సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా తరలించిన నిధుల్లో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరడం సాధారణ విషయం కాదని చెప్పారు. ఈ అంశంపై విచారించేందుకు టీడీపీ ఆడిటర్‌ను ఈ నెల 10న సీఐడీ విచారణకు పిలిచిందని తెలిపారు. ఈ కుంభకోణంలో మిగిలిన నిధులు కూడా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ఎలా చేరాయో వివరించారు.
ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేశారని చెప్పారు. నిధుల విడుదలకు అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని తెలిపారు. నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ను సీఐడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వగానే ఆయన పరారైన విషయాన్ని మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయని గతంలో 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఇటీవల అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలని చెప్పారు. దర్యాప్తు సక్రమంగా సాగి మొత్తం కుట్రను వెలికితీసే వరకూ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. రెండు రోజుల కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించలేదని, అందువల్ల ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరారు.
చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఒప్పందంతో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ముగిసిందని, ఆ తరువాత జరిగే అవినీతి, అక్రమాలతో ఆయనకు సంబంధం లేదని అన్నారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుతో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. సీఎం హోదాలోనే చంద్రబాబు నిధుల మంజూరుకు అనుమతించారని చెప్పారు. కాబట్టి చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలను శుక్రవారం కూడా వింటామని ఏసీబీ న్యాయస్థానం తెలిపింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.