తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ బండిఆత్మకూరు మండలం చిన్ని దేవళాపురం గ్రామానికి చెందిన చింతల నారాయణ అనే వృద్ధుడు రాజమండ్రికి పాదయాత్రగా వెళుతుంటే వైసీపీ మూకలు దాడికి పాల్పడటం దుర్మార్గానికి నిదర్శనమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ చింతల నారాయణ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమండ్రికి పాదయాత్రగా వెళుతున్న క్రమంలో వినుకొండ నియోజక వర్గంలోని విఠంరాజు పల్లి వద్ద వైసీపీ మూకలు పైశాచికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధుడు అన్న కనికరం లేకుండా అతని ముఖంపై దంతాలు ఊడేలా దాడి చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో తాము కూడా ఇలా చేసి ఉంటే వైసీపీ నాయకులు పాదయాత్రలు, నిరసనలు చేసేవారా అని ప్రశ్నించారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతల నారాయణకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వృద్ధుడిపై దాడి అమానుషం
బండిఆత్మకూరు : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పాదయాత్ర చేస్తున్న వృద్ధుడు చింతల నారాయణపై వైసీపీ అల్లరి మూకలు దాడికి పాల్పడటం అమానుషమని టీడీపీ నాయకులు అన్నారు. గురువారం మండల టీడీపీ నాయకులు కంచర్ల సురేష్‌రెడ్డి, మనోహర్‌చౌదరి, శంకర్, లింగారెడ్డి, బుగ్గరాముడు, జాకీర్‌ఖాన్, ఉశ్శేన్‌బాషా నారాయణను పరామర్శించేందుకు వినుకొండకు తరలివెళ్లారు.