తెలంగాణ వీణ , జనగామ : తండాల తలరాతలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో పాలనలో స్వతంత్ర పాలన సాగించు కుంటూ గ్రామ పంచాయతీలుగా వెలుగొందుతున్నాయన్నారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం ఏకే తండా, సూర్య తండా, బాలాజీ తండ, జయరామ్ తండా(ఎస్), బాలు నాయక్ తండా, దుబ్బ తండా, పానిష్ తండాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు.
మండలంలో తండా బాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి మాట్లాడారు. తెలంగాణకు ముందు తండాలు సాగునీరు, లేక, మంచినీరు లేక, కనీస సదుపాయాలు లేక తండ్లాడేవి. కేసీఆర్ సీఎం అయ్యాక తండాల తండ్లాట తప్పించారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చారు. వారి తండాల్లో వారి రాజ్యాన్ని తెచ్చారు. దీంతో మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్ది పోయే బాధ తప్పిందన్నారు.
ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్‌ది అయితే, అదే ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నాను. ఎన్నడూ రాని వాళ్లు మీ దగ్గరకు వస్తున్నారు. ఈ ఎన్నికలు అయిపోతే వారు వెళ్లిపోతారు. ఇన్నేండ్లు చేసిన అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలన్నారు.