తెలంగాణ వీణ , నల్గొండ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని పెన్‌పహాడ్ మండలం చీదెళ్ల గ్రామంలో పర్యటించిన మంత్రి గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. అనంతరం రైతులు తమ ఉత్పత్తులను నిలవ చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు గ్రామాలు అభివృద్ధి చెందాయంటే సీఎం కేసీఆర్ చొరవతోనేనని తెలిపారు. కాళేశ్వరం తొలి ఫలితం అందుకుంది పెన్ పహాడ్ మండలమేనని పేర్కొన్నారు.
2014 కు ముందు బీడు భూములుగా ఉన్న గ్రామాలు, తండాలను వందలాది కిలో మీటర్ల నుంచి గోదావరి జలాలను తెచ్చి ససశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. తండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొత్త పంచాయతీ భవనాన్ని కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చాక గ్రామాలన్నీ ఎలా అభివృద్ధి చెందాయో పరిశీలించాలన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనిత, మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి యుగంధర్, సర్పంచ్ సీతారాంరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారామ్ రెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కీర్తి వెంకట్రావు , రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గుర్రం అమృతా రెడ్డి. మిరియాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు పాల్గొన్నారు.