తెలంగాణ వీణ , ఖమ్మం : పూజ్యులు ఎన్టీఆర్ తనకు చిన్న వయస్సులోనే రాజకీయ జీవితం ఇచ్చారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కన్నారు. నేడు ఆయన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలేరులో శాశ్వత సమస్యల పరిష్కారం కోసం పనిచేసే అవకాశం భద్రాద్రి శ్రీ రామచంద్రుని ఆశీస్సులతో దక్కిందన్నారు. పదవులు శాశ్వతం కాదని… పదవిలో ఉండే అహంకార రాజకీయాలు వద్దని తుమ్మల అన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీకి కానుకగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మంచిగా ఉండాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని పార్టీలో చేరానన్నారు. సీతారామ ప్రాజెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని తుమ్మల తెలిపారు.