తెలంగాణ వీణ, క్రీడలు : 2023 వన్డే ప్రపంచకప్ ను న్యూజిలాండ్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఇంగ్లండ్ పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 9 వికెట్లకు 282 పరుగులు చేయగా… కేవలం 36.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి న్యూజిలాండ్ విజయకేతనం ఎగురవేసింది. తొలి ప్రపంచ కప్ ఆడుతున్న 23 ఏళ్ల రచిన్ రవీంద్ర తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో రవీంద్ర ఇప్పటి వరకు కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడాడు. మరోవైపు ఈ రచిన్ రవీంద్ర ఎవరని చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. రవీంద్ర తల్లిదండ్రులు ఇండియాలోనే పుట్టారు. రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తిది బెంగళూరు. 1990ల్లో వీరు న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. రచిన్ రవీంద్ర అక్కడే పుట్టాడు.న్యూజిలాండ్ లో ఉంటున్నా… రవీంద్ర క్రికెట్లో రాటు తేలింది మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే. క్రికెటర్ గా అతనిని రాటుతేల్చింది అనంతపురం. ప్రతి ఏడాది అనంతపురంకు వచ్చి… అక్కడ ఉన్న ఆర్డీటీకి వచ్చి క్రికెట్ ట్రైనింగ్ పొందడమే కాక, టోర్నీలు ఆడేవాడు. రవీంద్ర తండ్రికి న్యూజిలాండ్ లో హాట్ హాక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ఉంది. ఆ క్లబ్ తరపున ఇతర ప్లేయర్లతో కలిసి రవీంద్ర ఇక్కడకు వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడేవాడు. ఆ విధంగా అతనికి, అనంతపురంకు అవినాభావ సంబంధం ఉంది.