తెలంగాణ వీణ, సినిమా : ఆహా ఓటీటీ వేదికపై ఇప్పటివరకూ రెండు విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ ఇప్పుడు మూడో సీజన్ కు సన్నద్ధమవుతోంది. అన్ స్టాపబుల్-3కి సంబంధించి తొలి ఎపిసోడ్ దసరా వేళ ప్రసారం కానుందని తెలుస్తోంది. కాగా, అన్ స్టాపబుల్ కార్యక్రమానికి తన మాటల చాతుర్యంతో విశేష ఆదరణ తెచ్చిపెట్టిన బాలకృష్ణ మూడో సీజన్ కు కూడా హోస్ట్ గా వచ్చేందుకు ఓకే చెప్పాడని సమాచారం. ఈసారి బాలయ్య కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తారని ప్రచారం జరుగుతోంది. గత సీజన్లలో బాలయ్య తనదైన శైలిలో రాజకీయ నేతలను, సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం రక్తి కట్టించింది. బాలయ్య సూటిగా అడిగే ప్రశ్నలను, చమత్కారాలను వీక్షకులు బాగా ఇష్టపడుతున్నారనడానికి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చిన రేటింగ్సే నిదర్శనం.