తెలంగాణ వీణ , జాతీయం :మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా మరణాలు నమోదవుతున్నాయి. మూడు రోజుల్లో పసి పిల్లలతో సహా 38 మంది చనిపోయారు. బుధవారం నవజాత శిశువు, ఆ బిడ్డకు జన్మనిచ్చిన 22 ఏళ్ల మహిళ మరణించారు. తన కుమార్తె అంజలి, ఆమెకు పుట్టిన బిడ్డను కాపాడాలని డీన్ ఎస్‌ఆర్ వాకోడ్‌ను బతిమాలినప్పటికీ ఆయన పట్టించుకోలేదని, పిల్లల డాక్టర్లు అందుబాటులో లేరని మృతురాలి తండ్రి ఆరోపించాడు. తన కుమార్తె, నవజాత శిశువు మృతికి కారణమైన డీన్‌తోపాటు పిల్లల డాక్టర్‌పై నాందేడ్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నేరపూరిత నరహత్య కింద వారిపై కేసు నమోదు చేశారు
కాగా, నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్న నేపథ్యంలో శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు మురికిగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీన్ వాకోడ్‌తో టాయిలెట్లను క్లీన్ చేయించారు. ఈ నేపథ్యంలో డీన్ ఫిర్యాదుపై ఎంపీ హేమంత్ పాటిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆసుపత్రిలో తాజాగా నవజాత శిశువు, జన్మనిచ్చిన మహిళ మరణంపై ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు తాత్కాలిక డీన్ డాక్టర్ ఎస్ఆర్ వాకోడ్, పిల్లల వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.