తెలంగాణ వీణ , జాతీయం : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. ఉదయం నుంచి సంజయ్‌సింగ్ నివాసంలో సోదాలు జరిపిన తర్వాత ఈడీ ఆయనను మనీలాండరింగ్ చట్టం కింద అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్, ఉపముఖ్యమంత్రి సిసోడియాల అరెస్టుల తర్వాత జరిగిన మూడో పెద్ద అరెస్టుగా దీనిని భావిస్తున్నారు. మద్యం కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన వ్యాపారి దినేశ్ అరోరా ఇచ్చిన సమాచారం మేరకే సంజయ్‌సింగ్ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో జైలుపాలైన అరోరా ఇటీవలే విడుదలయ్యారు. సంజయ్‌సింగ్ ద్వారానే తాను అప్పటి ఎక్సైజ్‌శాఖ మంత్రి సిసోడియాను కలుసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అరెస్టుకు ముందు సంజయ్‌సింగ్ ఒక వీడియో రికార్డు చేసి విడుదల చేశారు. అదానీ కుంభకోణాలను బయటపెట్టినందువల్లే తనపై మోదీ సర్కారు అణచివేతకు పాల్పడుతోందన్నారు. సంజయ్ అరెస్టుపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందిస్తూ.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే సంజయ్ సింగ్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, మద్యం కుంభకోణంలో ఆప్‌కు లబ్ధి చేకూరినట్లు ఆరోపణలున్నప్పుడు ఆ పార్టీని ముద్దాయిగా ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు బుధవారం ఈడీని ప్రశ్నించింది. సిసోడియా బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ ప్రశ్న వేసింది. మనీలాండరింగ్ చట్టాన్ని ఒక రాజకీయ పార్టీకి వర్తింపచేసే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ ఎవర్నైనా అరెస్టు చేయాలంటే ఆ వ్యక్తికి లిఖితపూర్వకంగా కారణాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు మరో కేసులో తీర్పునిచ్చింది