తెలంగాణ వీణ , జాతీయం :సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్రప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ప్రస్తుతమున్న కృష్ణా ట్రైబ్యునల్‌కు అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం సెక్షన్ 5(1) ప్రకారం కొత్త విధివిధానాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఇటీవల తెలంగాణ పర్యటనలో ప్రధాని హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు, సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పటానికి నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు న్యాయసలహా తీసుకొని తాజా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం, 1956లోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ.. 2014లో జలాల పంపిణీ, వినియోగంపై కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసిందని, 2015లో సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. తమ ఫిర్యాదును ట్రైబ్యునల్‌కు నివేదించాలని 2018లో కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ మరోసారి విజ్ఞప్తి చేసిందన్నారు. దానిపై అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్‌కే కొత్త విధివిధానాలను ఖరారు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ కొత్త విధివిధానాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ జరగడమే కాకుండా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన గత చరిత్రను మంత్రులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ 1976లో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 811 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఆ తర్వాత కాలంలో నీటి పంపిణీపై 2004లో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఫిర్యాదు చేశాయని తెలిపారు. దాంతో కృష్ణా ట్రైబ్యునల్-2ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. 2013లో ట్రైబ్యునల్ నివేదిక ఇచ్చిందని, దాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నివేదికపై కోర్టు స్టే విధించిందని వివరించారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు చేపట్టడానికి ట్రై బ్యునల్ కాలపరిమితిని విస్తరించామని, 4 రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంపిణీ చేపట్టాలనే డిమాండ్ వచ్చిందని తెలిపారు. మరోవైపు కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉందని, ఇది పరిష్కారమైతే సుస్థిర జలవనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలలో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఈ పరిణామం ఎంతో దోహదపడుతుందన్నారు.
జాతీయ పసుపు బోర్డుకు చైర్‌పర్సన్‌ను కేంద్రప్రభుత్వం నియమిస్తుందని మంత్రులు అనురాగ్‌ఠాకూర్, కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ఆయుష్, ఫార్మాసూటికల్స్, వ్యవసాయ, వాణిజ్య-పరిశ్రమల శాఖల అధికారులు, రొటేషన్ పద్ధతిలో మూడు రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులు, పరిశోధన సంస్థల ప్ర తినిధులు, పసుపు రైతులు, ఎగుమతిదారులు బోర్డు సభ్యులుగా ఉంటారని వివరించారు. పసుపు, దాని ఉత్పత్తుల అభివృద్ధిపై జాతీయ బోర్డు దృష్టి పెడుతుందని తెలిపారు. పసుపు వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎగుమతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషించడం, నూతన వంగడాలపై పరిశోధనను ప్రోత్సహించడం, నాణ్యతను పెంచడం వంటివి బోర్డు ద్వారా జరుగుతాయన్నారు. కాగా, 2022-23లో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో పసుపు పంట సాగయ్యిందని, 11.61 లక్షల టన్నులు ఉత్పత్తయ్యిందని, దాదాపు 20 రాష్ట్రాల్లో 30కిపైగా రకాల పసుపు పండుతోందన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా పసుపు ఉత్పత్తవుతోందని తెలిపారు. 2022-23లో 207.45 మిలియన్ డాలర్ల విలువైన 1.534 లక్షల టన్నుల పసుపు విదేశా లకు ఎగుమతి అయ్యిందని, బంగ్లాదేశ్, యూఏఈ, అమెరికా, మలేషియాల్లో మనదేశ పసుపునకు మంచి డిమాండ్ ఉందన్నారు. 2030 నాటికి 100 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు చేయాలన్న లక్ష్యాన్ని విధించుకున్నామని తెలిపారు. ప్రపంచంలోనే భారత్‌లో పసుపు అత్యధికంగా ఉత్పత్తవుతుందని చెప్పారు.
రూ.889.07 కోట్ల వ్యయంతో తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం సెంట్రల్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, 2023ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఆమోదముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని, ఈ మేరకు ఏపీలో 2019లోనే గిరిజన వర్సిటీని స్థాపించామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తెలంగాణలో వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలం లభ్యం కావడానికి చాలా సమయం పట్టిందన్నారు. గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై గిరిజన వర్సిటీలో పరిశోధనలు జరుగుతాయని వెల్లడించారు. మరోవైపు, ఉ జ్వల పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్ తీసుకున్న పేద మహిళలకు అందించే సిలిండర్‌పై సబ్సిడీని ప్రస్తుతమున్న రూ.200 నుంచి రూ.300కు పెంచటానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనివల్ల 9.6కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఠాకూర్ తెలిపారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు వంటగ్యాస్ సిలిండర్ రూ.603కు లభించనుంది.