తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఎరుక కులస్థులకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పందుల పెంపకంపై నిషేధం విధించడంతో సరైన ఉపాధి లేక అల్లాడుతున్న ఎరుకల సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించారు. వారి సంక్షేమం కోసం చరిత్రలోనే తొలిసారి ఎంపవర్‌మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఆ పథకానికి రూ.60 కోట్లు కేటాయించారు. నేడు మెదక్ జిల్లాలో ఈ పథకం ప్రారంభం కానున్నది. ఈ స్కీమ్ కింద ప్రతి మండలంలో ఒక సొసైటీని ఏర్పాటు చేస్తారు. ప్రతి యూనిట్‌కు రూ.60 లక్షల చొప్పున మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్‌లో 100 ఆడ పందులు, 10 మగ పందులను ఇస్తారు. వాటి పెంపకం కోసం 2 నుంచి 3 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తారు.
పిల్లల పోషణ.. సంరక్షణ
పందులు ఏటా రెండుసార్లు ఈనుతాయి. ప్రతి ఈతలో దాదాపు 10 పిల్లలు పుడతాయి. వీటికి సరైన విధంగా ఆహారం అందిస్తే త్వరగా పెరుగుతాయి. పోషణ బాగుంటే 8 నెలల్లోపే ఎదకొస్తాయి. మార్కెట్‌లో లభించే దాణాతోపాటు పడేసిన కూరగాయలు, ఆహార వ్యర్థాలను పందుల పోషణకు ఉపయోగించుకోవచ్చు. దాణాను స్వయంగా కూడా తయారు చేసుకోవచ్చు. 55 శాతం మొకజొన్న, 20 శాతం వేరుశనగ చెక, 15 శాతం గోధుమ పొట్టు, 8.5 శాతం చేపల పొడి, ఒక వంతు ఖనిజ లవణ మిశ్రమం, అర వంతు ఉప్పు కలిపి దాణా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
కోళ్లు, మేకల పెంపకం తరహాలో ఉపాధి
పూర్వం పందులను సంప్రదాయ పద్ధతిలో మాత్రమే పెంచేవారు. కానీ, ఇప్పుడు ఆ పద్ధ్దతి మారింది. పందుల పెంపకానికి టెక్నాలజీ కూడా తోడైంది. దీంతో ఆదాయం పెరిగింది. కోళ్లు, మేకల తరహాలో పందుల పెంపకం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నది. పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలకు పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. పందుల నుంచి నికరంగా 60 నుంచి 85 శాతం మాంసం లభిస్తుంది. వీటి కొవ్వును కోళ్ల దాణాతోపాటు సబ్బులు, రంగులు, రసాయనాల తయారీకి వినియోగిస్తున్నారు.