తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రధాని మోదీ తన స్థాయి హోదాను మరిచి రాజకీయాల కోసం దిగజారి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ, స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయి ఉండి మోదీ నిజామాబాద్ సభలో హుందాతనం ప్రదర్శించకుండా నీచస్థాయికి దిగజారి మాట్లాడారని మండిపడ్డారు.జనగామలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజాన్ని అగౌరపరిచేలా, కేసీఆర్‌ను అవమానపరిచేలా మాట్లాడడం జుగుప్సాకరమని, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. అడుగడుగునా తెలంగాణను అవమానిస్తున్న ఇలాంటి పార్టీకి బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.