తెలంగాణ వీణ,సినిమా :టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తన కాళ్లకు తగిలిన గాయాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె చర్మం ఎర్రగా కందిపోయినట్టుగా గాయాలు ఉన్నాయి. ఈ ఫొటోలకు యుద్ధపు గాయాలు అని ఆమె క్యాప్షన్ పెట్టింది. బాక్సింగ్ అని కూడా జోడించింది. వ్యాయామంలో భాగంగా బాక్సింగ్ చేస్తుండగా గాయాలయ్యాయా? లేక ఏదైనా షూటింగ్ లో గాయపడిందా? అనే వివరాలను ఆమె వెల్లడించలేదు. మరోవైపు మోకాలి నొప్పితో బాధపడుతున్న పూజా హెగ్డే సర్జరీ చేయించుకుందనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. గతంలో కాలికి కట్టుతో పూజా కనిపించింది. సినిమాల విషయానికి వస్తే వరుస హిట్లతో ఒక వెలుగు వెలిగిన పూజాకు… ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. కొత్తగా ఆఫర్స్ రాకపోగా… ఉన్న ఆఫర్స్ కూడా చేజారుతున్నాయి. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాలో ఆమె క్యారెక్టర్ ను తగ్గించి, ఆమెను సెకండ్ హీరోయిన్ స్థాయికి తగ్గించేశారట. దీంతో, తాను తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేసి, ఆ సినిమాకు పూజా గుడ్ బై చెప్పేసింది. ‘జనగణమన’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఆమె చేజారింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కాల్సిన చిత్రం నిర్మాతలు తప్పుకోవడంతో నిలిచిపోయింది.