తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నెల్లూరులో నిన్న నిర్వహించిన టీడీపీ ర్యాలీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 16 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, పాశం సునీల్‌కుమార్, రామకృష్ణ, కంభం విజయరామిరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎన్ సుబ్రహ్మణ్యం, మాలెపాటి సుబ్బనాయుడు, చేజెర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, పొలంరెడ్డి దినేశ్‌రెడ్డి, గుమ్మడి రాజయాదవ్, వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, జనసేన నాయకుడు చెన్నారెడ్డి మాన్‌క్రాంత్‌రెడ్డి, సీపీఐనేత దామ అంకయ్య ఉన్నారు.
అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం వల్లే కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిజానికి ఈ ర్యాలీకి టీడీపీ నేతలు ముందస్తు అనుమతి కోరినప్పటికీ, శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిని ముందే ఊహించిన నేతలు మంగళవారం రాత్రి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌ను దూరంగా పెట్టేశారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులను ముందుగానే సినిమా హాళ్లు, లాడ్జీల్లో నింపేశారు. సరిగ్గా ర్యాలీ ప్రారంభమైన తర్వాత వీరంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు.