తెలంగాణ వీణ ,హైదరాబాద్ : ప్రధాని మోదీపై తెలంగాణ ఆదివాసీలు, గిరిజనులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం తమపై కురిపించింది ఓట్ల ప్రేమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదేండ్ల నుంచి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నా పట్టించుకోని మోదీ, ఎన్నికల ముందు ప్రేమ ఒలకబోస్తున్నారని ధ్వజమెత్తారు. నిజానికి గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర ప్రభుత్వం 335.04 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జూన్ 30, 2016న కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినప్పటి నుంచి మే 17, 2023 దాకా 27 సార్లు ప్రత్యుత్తరాలు జరిపింది.
సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. ఇన్నేండ్లు పట్టించుకోని మోదీ.. ఇప్పుడు గిరిజనులపై ప్రేమ పుట్టుకురావటానికి కారణం స్వార్థ ప్రయోజనమేనని గిరిజన సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2015లో ములుగు జిల్లా బండారుపల్లిలో వర్సిటీ కోసం రెండు స్థలాలను ఎంపిక చేసి కేంద్రానికి నివేదించింది. ఈ స్థలాలు అనువైనవి కాదని కేంద్రం తిరస్కరిస్తే జూన్ 30, 2016లో మరో 4 అనువైన స్థలాలను ఎంపిక చేసి నివేదించింది.
ఆ తరువాత కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ వర్సిటీ స్థల ఎంపిక కోసం ఒక కమిటీని వేసింది. 2017, ఫిబ్రవరి 23న స్థల పరిశీలనకు కేంద్ర బృందం పర్యటించింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఎప్పటికప్పుడు కేంద్రంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉన్నది. కేంద్రం అంటీఅంటనట్టు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం జనవరి 11, 2019న షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.15 కోట్లు కేటాయించింది. 2019-20 బడ్జెట్‌లో డీపీఆర్ రూపకల్పనకు రూ.4 కోట్లు కేటాయించింది. తక్షణ తరగతులు ప్రారంభించేందుకు వీలుగా ములుగు జిల్లా, జాకారంలోని యువశిక్షణా కేంద్రంను తాత్కాలిక ప్రాంగణంగా స్వీకరించాలని కేంద్రానికి నివేదించి, వైటీసీ మరమ్మతులు, ఇతర సౌకర్యాల కోసం రూ. 3 కోట్లు కేటాయించింది.