తెలంగాణ వీణ ,హైదరాబాద్ :తొమ్మిదిన్నరేండ్లుగా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని తుంగలో తొక్కింది. హక్కుగా ఇవ్వాల్సిన అంశాలను తేల్చకుండా మోదీ మిన్నకుండిపోయారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ల వేట మొదలుపెట్టారు. పసుపుబోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటన, కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్.. ఇలా వరుసగా ఒక్కో అంశాన్ని తేల్చుతూ వస్తున్నారు. ఇది పక్కా ఎన్నికల స్టంటేనని స్పష్టం అవుతున్నది. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ తెలంగాణలో జాతీయ పసుపుబోర్డు, ములుగులో సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపడంతోపాటు కృష్ణాజలాల వివాదాన్ని పరిష్కరించాలని నిర్ణయించింది.2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 27న ప్రధాని ప్రచారం చేశారు. ఎన్నికల వేళ విభజన హామీలపైనో, కేంద్ర సంస్థల ఏర్పాటుపైనో స్పష్టమైన హామీ ఇస్తారని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తే.. మోదీ మాత్రం బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే తంతు. దాదాపు నాలుగుసార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వ విన్నపాలనుగానీ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కానీ పట్టించుకోలేదు. స్వయంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాసి ఇచ్చిన బాండ్‌ను పక్కనపడేశారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 14సార్లు మోదీ పర్యటిస్తే.. 12సార్లు తెలంగాణకు మొండిచేయి చూపించారు.మా హామీలు నెరవేర్చాలంటూ ప్రభుత్వం, ప్రజలు నిలదీసినా, పోస్టర్లు వేసినా, ఫ్లెక్సీలు కట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఓవైపు ప్రజలు తమ హక్కుల కోసం ఉద్ధృతంగా పోరాటం చేస్తుండడం, మరోవైపు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో హామీలు నెరవేర్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు కూడా సమయం దగ్గరపడడంతో మోదీ తనకు అలవాటైన ‘ఓట్ల వేట’ మొదలు పెట్టారు. తొమ్మిదిన్నరేండ్ల కిందటే ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మభ్యపెట్టినందుకు మన్నించాలని వేడుకోవాల్సింది పోయి.. ప్రజల పోరాటాన్ని, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని అభినందించాల్సిందిపోయి.. బీజేపీ ప్రభుత్వం ఏదో కొత్తగా ఇచ్చినట్టు గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు, కృష్ణా జలాల్లో వాటాపై హామీలు గుప్పించారు. దీనిని బట్టి ఇది పక్కాగా ఎన్నికల స్టంటేనని తెలంగాణ ప్రజలకు అర్థమైంది.
12సార్లు ఉత్త చేతులే
తెలంగాణ ఏర్పడిన తర్వాత మోదీ ఇప్పటివరకు 14 సార్లు తెలంగాణలో పర్యటించారు. మొదటిసారి 2016లో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభావేదికపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టానికి ఒక జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు మంజూ రు చేయాలని, విభజన హామీలు నెరవేర్చాలని, ఐటీఐఆర్ పనులు ప్రారంభించాలని, ఎయిమ్స్, ఐఐఎం వంటి సంస్థలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు ‘అలాగే’ అన్నట్టుగా నవ్వుతూ తలూపిన ప్రధాని ఇప్పటివరకు అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 2017 నవంబర్‌లో జరిగిన జీఈఎస్ సదస్సుకు కూడా ఉత్త చేతులతో వచ్చి వెళ్లిపోయారు.