తెలంగాణ వీణ ,హైదరాబాద్ : బీసీలకు ధోకా కార్యక్రమానికి కాంగ్రెస్ మరోమారు సిద్ధమైంది. నిన్నమొన్నటి వరకు ‘బీసీ డిక్లరేషన్’ ద్వారా బీసీలను అందలమెక్కిస్తామని గప్పాలు కొట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా కూర్చున్నారు. ఈ నెల 10న షాద్‌నగర్‌లో ‘బీసీ గర్జన’ పేరిట సభ నిర్వహించి అందులో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆ సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని కూడా తెలిపింది. చెప్పిన సమయానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఆ పార్టీకి చెందిన ఒక్క నేత కూడా బీసీ డిక్లరేషన్‌పై నోరు మెదపడం లేదు. బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా బీసీ డిక్లరేషన్ సభపై స్పందించేందుకు ఇష్టపడకపోవడం అనుమానాలను బలపరుస్తున్నది. బీసీ గర్జన, బీసీ డిక్లరేషన్‌కు సంబంధించి కీలక బాధ్యతలను ఆ పార్టీ సీనియర్ నేతలైన పొన్నం ప్రభాకర్, వీహెచ్‌కు పార్టీ అప్పగించింది. పార్టీ ఆదేశాలతో మరో సీనియర్ నేత వీహెచ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీ సభ సన్నాహాక సమావేశాలను నిర్వహించారు. ఇప్పుడీ నేతలు బీసీ డిక్లరేషన్‌పై నోరు మెదపడం లేదు. ఇతర నేతలు ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అవమానమే ఇందుకు కారణమని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో తమకు 34 సీట్లు కేటాయించాలని బీసీలు డిమాండ్ చేస్తున్నా అధిష్ఠానం ససేమిరా అంటున్నది. వారం క్రితం ఢిల్లీ వెళ్లిన బీసీ నేతలకు హస్తిన వేదికగా తీవ్ర అవమానం ఎదురైనట్టు తెలిసింది. పార్టీ పెద్దలు ఖర్గే, సోనియా, రాహుల్ కనీసం వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బీసీ నేతలకు చీవాట్లు పెట్టడంతోపాటు తీవ్రంగా అవమానించినట్టు సమాచారం. బీసీ డిక్లరేషన్ కూడా లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఆయన మాటలతో మనస్తాపానికి గురైన బీసీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ‘బీసీ డిక్లరేషన్ లేదు, బీసీలకు టికెట్లు ఇవ్వరు కానీ బీసీల ఓట్లు మాత్రం కావాలి. పార్టీ కోసం బీసీలు వెట్టి చాకిరీ చేయాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.