తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొత్త లాజిక్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కెయ్యాలంటే తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటపటిమ అవసరం అంటూ పేర్కొన్నారు.
ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పెడనలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని.. అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. జగన్‌ను గద్దె దించడానికి ఉమ్మడిపోరాటం అవసరమని, కేసులకు భయపడబోనని పవన్ చెప్పారు. ప్రజలను కులాలుగా విడదీసి తాను రాజకీయాలు చేయబోనని, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ సమానంగా చూస్తానన్నారు. ఏపీలో కుల భావన ఎక్కువ, ఒక్కటే అనే జాతి భావన తక్కువని చెప్పారు. యువత కులాలకు అతీతంగా ఆలోచించాలని, ఏపీ ప్రయోజనాల కోసం అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ముదినేపల్లిలో బహిరంగ సభ..
ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర బహిరంగ సభ ఇవాళ ముదినేపల్లిలో జరగనుంది. గురువారం సాయంత్రం 4 గంటలకు గురజా సెంటర్లో బహిరంగ సభకు ఏర్పాట్ల చేశారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేనతోపాటు.. టీడీపీ నాయకులు సైతం పిలుపునిచ్చారు. కలిదిండి, కైకలూరు, మండవల్లి, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు. అయితే, పవన్ కల్యాణ్ సాయంత్రం మచిలీపట్నం బంటుమిల్లి మీదగా ముదినేపల్లి చేరుకోనున్నారు.
కాగా.. ఇప్పటికే మాటల వేడిని పెంచిన పవన్ కల్యాణ్.. ముదినేపల్లి సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ యాత్ర నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తును పెంచారు.