తెలంగాణ వీణ ,హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌లోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలకు స్థానం లేదని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ తన అనుచరులతో కలిసి బుధవారం సాయంత్రం బీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీధర్‌తోపాటు కాంగ్రెస్‌ను వీడిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్, విప్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీన నవీన్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున దాదాపు టికెట్ ఖరారై, చివరి నిమిషంలో తీరని అన్యాయం జరిగిందనే ఆవేదనతో నందికంటి బీఆర్‌ఎస్‌లో చేరాలనే పెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జీవితంలో మొదటిసారిగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వస్తున్న శ్రీధర్‌ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.గత పదేండ్లుగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సరైన ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు. గత పదేండ్లలో హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో, ఈ ఏవిధంగా అభివృద్ధి అయిందో గుర్తించాలని అన్నారు. నందికంటి శ్రీధర్‌కు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని, బీఆర్‌ఎస్‌లో ఆయనకు తగిన గౌరవం కల్పిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న శ్రీధర్.. కాంగ్రెస్‌లో ఎంత నిబద్దతతో పని చేశారో తాను అంతే నిబద్దతతో బీఆర్‌ఎస్‌లో కూడా పని చేస్తానని చెప్పిన మాటలు ఎంతో నచ్చాయని అన్నారు. శ్రీధర్‌తోపాటు ఆయన అనుచరులను కాపాడుకుంటామని, వారిని కూడా సరైన విధంగా గౌరవించుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు ఉన్న హైకమాండ్, నాయకులు కేసీఆర్ ఒక్కరు మాత్రమేనని, ఆయన ఆదేశాలు, సూచనల మేరకు మాత్రమే పార్టీ పని చేస్తుందన్నారు. తమకు ఢిల్లీలో బాసులు లేరని చెప్పారు.