తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టుకు అందజేసిన పత్రాలన్నింటిని సోమవారం లోపు తమకు సమర్పించాలని ఆదేశించింది. చంద్రబాబు పిటిషన్‌పై అంతకుముందు సుదీర్ఘ వాదనలు జరిగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది.చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున వాదనలు వినిపంచిన ముకుల్ రోహత్గీ.. పిటిషనర్ బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్‌పైనే వాదిస్తున్నారని అన్నారు. తమకు అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు. దాంతో కేసుకు సంబంధించి హైకోర్టు ముందు ఉంచిన పత్రాలన్నింటిని తమకు సమర్పించాలని ఆదేశిస్తూ బాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.