తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : తన భార్య రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఇలా అనుచితంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాగే మాట్లాడారని మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి అన్నారు. తన భార్య బలంగా పోరాడుతున్నారని, అందుకే ఆమెను మానసికంగా దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారన్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వీళ్లు ఎన్ని రోజులు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు? అని ప్రశ్నించారు.
తాను బండారు సత్యనారాయణకు సవాల్ చేస్తున్నానని, మీ వద్ద ఏమైనా వీడియోలు ఉంటే కచ్చితంగా బయట పెట్టవచ్చునన్నారు. మా కోసం ఆగాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి బెదిరింపులు, నీచమైన పనులు తమకు వద్దన్నారు. అసలు టీడీపీ పార్టీకే ఇలాంటి జబ్బు ఉందేమో అన్నారు. ఇంతకుముందు కూడా కొంతమంది ఇలాగే మాట్లాడారన్నారు.
రోజా మంచి ఫైటర్ కాబట్టి, ఆమెను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బండారు వద్ద ఏవైనా ఉంటే ధైర్యంగా బయటపెట్టాలని, అలాంటి వాటిని తాము ఫేస్ చేస్తామన్నారు. మగాడు అంటే చెప్పినమాట మీద ఉండేవాడన్నారు.