తెలంగాణ వీణ , హైదరాబాద్ : సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతామని, గుడిసేలేని మొట్టమొదటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు, గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక చేయూత చెక్కులను, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్‌లను హోంమంత్రి మహమ్మూద్ అలీతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో గుడిసె లేని నియోజకవర్గంగా సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు జిల్లాలోని గుడిసెలు, ఇళ్లు లేని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించామన్నారు. కలెక్టర్‌ను ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించారని, 1749 మంది అర్హులను గుర్తించారని అన్నారు. ఇందులో గుడిసెలు 628, రేకుల షెడ్లు 457, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు 667 ఉన్నట్టు గుర్తించారన్నారు. వీరికి మొదటి ప్రాధాన్యం కింద గృహలక్ష్మి పథకం ద్వారా అర్థిక సాయం అందజేస్తామన్నారు. ఎలాంటి పైరవీలూ లేవని, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీల వద్దకు వెళ్లకుండానే అధికారులే లబ్ధిదారులను గుర్తించారని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, గృహలక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేయగా ఇంకా మిగిలిపోయినవారికి ముఖ్యమంత్రి కాళ్లు మొకైనా అదనంగా వీరితోపాటు మిగిలిన వారికీ అందజేస్తామన్నారు. మంజూరు చేస్తామన్నారు. సిరిసిల్లలో ఇప్పటికే 2800 మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించేందుకు అర్హులుగా తేల్చామన్నారు. వీరిలో మండెపల్లిలో 1260 మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పటికే కేటాయించామని, రగుడు, పెద్దూర్, శాంతినగర్‌కు సంబంధించిన 578 మందికి పట్టాలు అందజేశామని అన్నారు. మిగిలిన అర్హులకు అందిస్తామని, ఆగం కావద్దని అన్నారు. అర్హుల జాబితా తమవద్దనే ఉందని, కార్యాలయాల చుట్టూ తిరగవద్దని అన్నారు. అధికారులు నేరుగా వచ్చి అందిస్తారన్నారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దన్నారు.