తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పుట్టుకను పదే పదే అవమానిస్తున్న మోదీ.. తెలంగాణ స్వాతంత్య్ర పోరాటాన్ని ఇవాళ నిజామాబాద్‌లో అవమానించారు. అంతేకాదు, స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్థాయిని తగ్గించేలా మాట్లాడారు. ఒక గుజరాతీ వల్లనే తెలంగాణకు స్వాతంత్య్రం దక్కిందట. ఇపుడు ఇంకొకరు మళ్లీ తెలంగాణను విముక్తి చేస్తారట.భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధుడిని, జాతి నేతను గుజరాతీ నాయకుడని పిలవడం ద్వారా ఉక్కుమనిషిని అవమానిస్తారా?
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గుజరాతీ కాదు! భారత స్వాతంత్య్ర సమర యోధుడు.
నెహ్రూకు సరితూగే నాయకుడు.. ముక్కలుగా ఉన్న దేశానికి ఒక రూపునిచ్చిన ఉక్కుమనిషి.
భారత దేశానికి తొలి ఉపప్రధాని, హోం శాఖ మంత్రి. హైదరాబాద్ స్టేట్ ప్రజల పోరాటానికి స్పందించి, వారి వినతి మేరకు, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి భారత సైన్యం హైదరాబాద్‌ను విముక్తం చేసింది. సర్దార్ దేశ ఉప ప్రధానిగా నిర్ణయం తీసుకున్నారు తప్ప గుజరాతీగా కాదు. దేశ నాయకుడైన సర్దార్ స్థాయిని గుజరాతీ అంటూ ప్రధాని మోదీ పరిమితం చేయడం విచారకరం. ఎవరో దయతలిస్తే హైదరాబాద్ స్టేట్‌కు స్వాతంత్య్రం వచ్చిందా? ఇది ఎవరో వేసిన భిక్షా? అది ప్రజల కోరిక మేరకు భారత సైన్యం అండతో భారత ప్రభుత్వం సాధించిన ఘనత. అంతకు ముందే ఇక్కడ ఉద్యమాలు జరగలేదా? ప్రజలు ప్రాణాలొడ్డి సాయుధ పోరాటం చేయలేదా? పౌరుషానికి ప్రతిరూపమైన ఈ గడ్డ విమోచనం ఎవరి దయ కాదు. బిచ్చం కాదు. బందూకులు పట్టి నిరంకుశ సైన్యాన్ని ఉరికించిన నేల ఇది. ఆడబిడ్డలు కొంగు బిగించి, ఉన్మాదుల విచ్చుకత్తుల కోలాటంలోనూ జాతీయజెండాను ఎగరేసి సగర్వంగా తల ఎగరేసిన నేల ఇది. ఇది ప్రజలు సాధించుకున్నది. దిక్కుమాలిన రాజకీయం కోసం ప్రాణాలర్పించిన ప్రజలను, రైతాంగ సాయుధ పోరాట వీరులను, వారి త్యాగాలను అవమానిస్తారా? నాలుగు ఓట్ల కోసం చరిత్రను అవహేళన చేస్తారా?